05-09-2025 04:35:02 PM
హైదరాబాద్: వినాయక నిమజ్జనం ట్రాఫిక్ పోలీసులకు చాలా కీలకమని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయాల్ డెవిస్(Hyderabad Traffic Joint CP Joel Davis) మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... వినాయక నిమజ్జనం కోసం నెలముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించామని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. రోడ్లు భవనాలశాఖ, సమాచార శాఖ సహాకారం తీసుకుంటున్నామని.. అలాగే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రవాణా, విద్యుత్ అధికారుల సహాయం తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ప్రారంభమవుతుందన్నారు. నిమజ్జన కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం పూర్తికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించాలని సీపీ జోయాల్ డెవిస్ కోరారు.