calender_icon.png 6 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా చత్రు నాయక్

05-09-2025 09:51:16 PM

గరిడేపల్లి మండల విద్యాధికారిగా పనిచేస్తున్న చత్రు నాయక్ 

గురుపూజోత్సవం సందర్భంగా అవార్డు అందుకోవడం సంతోషకరం చత్రు నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పానుగోతు చత్రు నాయక్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు.హైదరాబాదు రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా చేతులు మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న వేదికపై నుంచి అవార్డు అందుకోవటం పట్ల మండల విద్యాధికారి చత్రు నాయక్ తనకు ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తూ అదనంగా మండల విద్యా అధికారిగా బాధ్యతలు చేపట్టారు.జిల్లాస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన చత్రు నాయక్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం పట్ల మండల ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ మిర్యాలగూడ మండలం లోని తక్కెళ్ళపాడు తండా గ్రామానికి చెందినవారు. 1997 లో ఉద్యోగం పొందిన ఆయన మొదటిసారిగా నల్గొండ జిల్లాలోని రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి 2003 వరకు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు.

2003 నుంచి 25 జూలై వరకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సూర్యాపేట జిల్లా చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన పని చేశారు. 2005 నుంచి 2009 జూన్ వరకు నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ అదనంగా నిడమనూరు మండల విద్యాధికారిగా పనిచేశారు.2009 నుంచి 2017 జూన్ వరకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.అదే సమయంలో వేములపల్లి, మిర్యాలగూడ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలకు ప్రత్యేక అధికారిగా పని చేశారు.

అనంతరం 2023 వరకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలకు మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2023 సంవత్సరం నుంచి ప్రస్తుతం గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ గరిడేపల్లి మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి చత్రునాయక్ మాట్లాడుతూ తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, సంబంధిత పాఠశాల ఆవరణలో మొక్కలను విరివిగా నాటడం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 6000, మొక్కలను నాటడం జరిగిందన్నారు. మఠంపల్లి పాఠశాలలో 680, గరిడేపల్లి ఉన్నత పాఠశాలలో 500కు పైగా మొక్కలను నాటి వాటిని సంరక్షించి పెంచినట్లు తెలిపారు.

ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానోపాధ్యాయులుగా మండల విద్యాధికారిగా అనేకసార్లు ఉత్తమ అవార్డులను అందుకున్నానని తెలిపారు.తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించడం జరిగిందని తెలిపారు.ప్రధానోపాధ్యాయులుగా తాను పనిచేసే పాఠశాలతో పాటు మండల విద్యాధికారిగా మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో సహచరులైన ఉపాధ్యాయులు,విద్యార్థుల సహకారంతోనే తాను ఈ విజయాలను సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులు తనతో పాటు సమయపాలన పాటించడమే కాక క్రమశిక్షణతో ఉండేందుకు తన సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు సహకరించడమే కాక ఎంతో ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా తాను ఈ ఘనతను సాధించినట్లు తెలిపారు. తన ఉద్యోగం ప్రారంభించి ఇప్పటివరకు ఆకస్మిక సెలవులు తప్ప ఎలాంటి ఇతర సెలవులను ఇప్పటివరకు వినియోగించుకోలేదని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కుటుంబ నేపథ్యం  ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరి సహకారంతో ప్రోత్సాహంతో నేడు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.