05-12-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వొడాఫోన్ ఐడియాలో భాగస్వామి అయిన బ్రిటన్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఇండస్ టవర్స్‌లో 3 శాతం వాటాను రూ.2,841 కోట్లకు విక్రయించడానికి సిద్ధమయ్యింది. తమ ఇండియా వెంచర్ వొడాఫోన్ ఐడియాకు సంబంధించిన బకాయిలు రూ.856 కోట్లు చెల్లించేందుకు, ఇతర రుణాల చెల్లింపునకు వాటా విక్రయిస్తున్నట్లు ఎక్సేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఇండస్ టవర్న్ షేరు బుధవారం రూ.358 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద వొడాఫోన్ 3 శాతం వాటాను (7.92 కోట్ల షేర్లు) విక్రయిస్తే రూ.2,841 కోట్లు సమకూరుతుంది. ఓపెన్ మార్కెట్లో బుక్‌బిల్డింగ్ రూపంలో విక్రయ లావాదేవీ జరపనున్నట్టు వొడాఫోన్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ 18 శాతం వాటాను విక్రయించి రూ. 15,300 కోట్లు సమీకరించింది. టవర్స్ కంపెనీలో ప్రస్తుతం బ్రిటన్ సంస్థకు 3.1 శాతం వాటా ఉన్నది.