- ఇందూరులో చెలరేగుతున్న బియ్యం మాఫియా
- రైస్ మిలర్ల అండదండలు
- ముఠాలను ప్రోత్సహిస్తున్న మిల్లర్ల అసోసియేషన్
నిజామాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పేరుకు అది రైస్‌మిల్లర్స్ అసోసి యేషన్. కానీ, వారి తీరు అండర్ గ్రౌండ్ మాఫీయాకు ఏమాత్రం తీసిపోదు. ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన వడ్లను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని వందల కోట్లు అర్జిస్తున్న పెద్దమనుషులు.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని రీసైక్లింగ్ పీడీఎస్ బియ్యంతో భర్తీచేస్తున్నారు.
నిజామాబాద్ రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని పెద్ద మనుషులు, తమ ఆధీనంలోని పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ ముఠాలతో కలిసి మహారాష్ట్రలోని కృష్ణురుతో పాటు నిజామా బాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని రీసైక్లింగ్ దందాను తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ బాలాజీ రైస్ మిల్లులో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు లారీల్లోని 260 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే రైసు మిల్లులో ౧౦ రోజుల క్రితం సివిల్ సప్లు అధికారులు లారీ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని 6ఏ కేసును నమోదు చేశారు. మిల్లుపై కేసు నమోదైనా.. మిల్లు యజమాని యథేచ్ఛగా మరో రెండు లారీల బియ్యం కొనుగోలు చేసి దందా నడపించడం గమనార్హం.
అధికారుల అండదండలు
అధికారుల అండదండలు లేకుండా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయడం రైసు మిల్లర్లకు అసాధ్యం. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తే పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన సివిల్ సప్లు శాఖ అధికారులు తూతూ మంత్రంగా 6ఏ కేసులు నమోదు చేసి, తర్వాత వారే ఆ కేసులను రద్దు చేస్తుండటంతో రైస్ మిల్లర్లలో భయం లేకుండా పోయింది. ఫలితంగా పీడీఎస్ బియ్యం దందా నిరంతరాయంగా నడిపిస్తున్నారు
రీసైక్లింగ్ బియ్యంతో లాభాల పంట
కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వం మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యం మరపట్టించి నందుకు మిల్లర్లకు కొంత కమిషన్ చెల్లిస్తుంది. అయితే దీనిని మరపట్టి ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.౫౫ చొప్పున అమ్ముకుంటున్నారు. అనంతరం ప్రజలతోపాటు వివిధ మార్గాల ద్వారా వచ్చిన పీడీఎస్ బియ్యాన్ని కిలోకు రూ.౩౦ నుంచి రూ. ౩౫ వరకు చెల్లించి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అప్పజెప్పుతున్నారు. తద్వారా మిల్లర్లు కేజీకి దాదాపు రూ.౨౦ చొప్పున కోట్లరూపాయలు గడిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు వీరికి అండగా నిలుస్తున్నారు.
మండలం నుంచి రాష్ట్రస్థాయి వరకు..
పీడీఎస్ బియ్యం కొనుగోలు వ్యవహారంలో నిజామాబాద్ జిల్లాలో నాలుగు ముఠాలు విజృంభిస్తున్నాయి. ప్రభాకర్ రెడ్డి, విష్ణవర్ధన్‌రెడ్డి, గణేశ్, వంశీ గ్రూపునకు చెందిన వ్యక్తులు 2010 నుంచి పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కింది స్థాయి అధికారి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు డబ్బులు ఇచ్చి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు.
ఈ నాలుగు గ్రూపులకు చెందిన వ్యక్తులకు నిజామాబాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్ద మనుషులు అండదండలు అందిస్తు, వారి వ్యాపారంలో బినామీలుగా ఉంటున్నారు. ఈ గ్రూపులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ పెద్దమనుషులు కలిపి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కృష్ణురు, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాలో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ రీసైక్లింగ్ దందాపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వ్యవస్థీకతంగా వేళ్లూనుకున్న బియ్యం రీసైక్లింగ్ దందా ఆగేలా కనిపించట్లేదు.
కోటగిరి రైస్ మిల్లులో టాస్క్‌ఫోర్స్ తనిఖీ
- రెండు లారీల రేషన్ బియ్యం స్వాధీనం
- 10 రోజుల వ్యవధిలో రెండోసారి పట్టివేత
- బియ్యం పట్టుబడినా తూతూమంత్రం కేసులు
- అధికారుల అండతో యథేచ్ఛగా దందా
నిజామాబాద్, ఆగస్ట్ 7 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఓ రైస్ మిల్లులో రెండు లారీల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇదే రైస్ మిల్లులో పది రోజుల వ్యవధిలో రేషన్ బియ్యం దొరకడం ఇది రెండోసారి. పోలీసులు రైస్‌మిల్లు యజమానిని ఆదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోటగిరి మండలకేంద్రంలోని ఎత్తొండ రోడ్డులో ఉన్న బాలాజీ రైస్ మిల్లులో, రెండు రేషన్ బియ్యం లారీలు ఉన్నాయన్న సమాచారం మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
మంగళవారం అర్థరాత్రి తర్వాత రైస్ మిల్లు వద్దకు వెళ్లిన పోలీసులు.. మిల్లులో తనిఖీలు చేపట్టారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యం లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల క్రితం సివిల్ సఫ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇదే మిల్లుపై దాడులు నిర్వహించగా, ఓ రేషన్ బియ్యం లారీ పట్టుబడింది. తాజాగా మరోసారి రెండు లారీల రేషన్ బియ్యం దొరకడం చర్చనీయాంశంగా మారింది.
తూతూ మంత్రంగా కేసులు
గతంలో సైతం అనేక సార్లు ఈ మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడ్డా, సివిల్ సప్లు అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో మిల్లు యజమాని యథేచ్ఛగా రేషన్ బియ్యం కొనుగోలు దందా నిర్వహిస్తున్నాడు. రేషన్ బియ్యం రవాణాపై నిజామాబాద్ సీపీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై నిజామాబాద్ ఏజేసీ కిరణ్ కుమార్‌ను సంప్రదించగా మంగళవారం అర్ధరాత్రి బాలాజీ రైస్ మిల్లులో 260 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుబడ్డాయని, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి బియ్యాన్ని పట్టుకున్నారని నిర్ధారించారు. దీనిపై సివిల్ సప్లు అధికారులు 6ఏ కేసు నమోదు చేశారని, బుధవారం సాయంత్రం దీనిపై పంచనామా నిర్వహించారని ఏజేసీ తెలిపారు.