02-11-2025 01:26:18 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని, ఆ పార్టీలది లోపాయికారి ఒప్పందం అని పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల రుణం తీర్చు కోవడానికే బీజేపీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా మాట్లాడిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఇతర నేతలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడా రు. “బీజేపీ, బీఆర్‌ఎస్ రెం డు పార్టీలూ ఒక్కటే. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్ తెర వెనుక సహకరించింది. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికే జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టి, బీఆర్‌ఎస్ గెలుపుకు సహకరి స్తోంది” అని ఆరోపించారు. రూ.5 వేలు తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటేయమని కేటీఆర్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ డమే అని విమర్శించారు.
డబ్బుతో ఓట్లను కొనాలనే ఈ అనైతిక చర్యపై ఎన్నికల కమిషన్ సు మోటోగా కేసు నమోదు చేయాలని మహేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలన లో’అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు, కేసీఆర్ పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి మోసం చేశారని మండిపడ్డారు. ఆయన కుటుంబంలో వారికి తప్ప రాష్ర్టం లో ఏ ఒక్క యువకుడికీ ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల పాటు కేబినెట్‌లో మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదని ఆయన విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇచ్చిన మెజారిటీ హామీలను ఇప్పటికే అమలు చేసిందని, ఆ ధైర్యంతోనే ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వెళ్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు మత రాజకీయాలు, లోపాయికారీ ఒప్పందాలతో ఓట్లు అడుగుతున్నాయని, జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, శివసేనరెడ్డి పాల్గొన్నారు.