calender_icon.png 25 November, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు కోసం నిరీక్షణ.. దూసుకొచ్చిన వాహనం

11-02-2025 12:15:18 AM

ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలు 

 న్యాయం చేయాలని రోడ్డుపై గ్రామస్థుల ధర్నా 

మేడ్చల్, ఫిబ్రవరి 10(విజయ క్రాంతి): బస్సు కోసం వేచి చూస్తున్నా వారిపైకి రెడీమిక్స్ వాహనం దూసుకురావడంతో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలైన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంతాయిపల్లి గ్రామానికి చెందిన కొరివి గాయత్రి (24), కొరివి భవాని (19) తిరుమలగిరిలో పనిచేయడానికి వెళ్లడానికి బిట్స్ జంక్షన్ వద్ద బస్సు కోసం నిలుచొని ఉండగా కీసర రోడ్డు నుండి వేగంగా వచ్చిన ఆర్‌ఎంసి వాహనం ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వీరి పైకి దూసుకొచ్చింది.

వీరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్‌ఎంసి వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అంతాయిపల్లి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. క్షతగాత్రులు పేదవారైనందున ఆసుపత్రి ఖర్చులన్నీ భరించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.