19-03-2025 12:30:01 AM
నాగర్ కర్నూల్ మార్చి 18 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారి తొమ్మిదేళ్లు కావస్తున్నా నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఇంకా ప్రథమ చికిత్సకే పరిమితమయింది. అందుకు ప్రధాన కారణం రేడియాలజిస్ట్ లేక పోవడమేనని వైద్యాధికారులు తెగేసి చెప్తున్నారు. లక్షల్లో జీతాలిస్తామన్న రేడియాలజిస్ట్ పోస్టు భర్తీ కోసం ఎవరు ఆసక్తి చూపడం లేదని వైద్యాధికారులు ప్రకటించారు.
ఫలితంగా రోడ్డు ప్రమాద దాటికి క్షతగాత్రులుగా ఉన్న వారితోపాటు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా మెడికల్ కళాశాల ఏర్పాటై సుమారు మూడేళ్లు గడుస్తున్నా కనీసం సిటి స్కానింగ్ అందుబాటులో లేకపోవడంతో కేవలం ప్రథమ చికిత్సకే పరిమితమైందని ఈ ప్రాంతవాసులు పెదవిరుస్తున్నారు.
ఆయా ఎన్నికల సందర్భంలో పాలకులు ప్రగల్బాలు పలికారే తప్ప ఆశించిన స్థాయిలో అడుగులు వేయకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పక్కనే ఉన్న వనపర్తి జిల్లా కేంద్రంలోనూ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నా నాగర్ కర్నూల్ జిల్లా రోగులు మాత్రం ప్రథమ చికిత్సకే పరిమితమాయ్యారు.
గర్భం దాల్చిన మహిళలకు సైతం అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే చేయడంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్న పరిస్థితి. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం సిటీ స్కానింగ్ యంత్రం ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ రేడియాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఆ యంత్రం అలంకారప్రాయంగానే మిగిలిపోయిందని మండి పడుతున్నారు.
గత పదేళ్ల టిఆర్‌ఎస్ పరిపాలనలోనూ నాగర్ కర్నూల్ ఆసుపత్రి అభి వృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అంతా వైద్యులే అయినప్పటికీ జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి సహకరించకపోవడం విశేషం. ఇప్పటికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయకపోవడం వెనక ఆంతర్యం వైద్య మాఫియాను ప్రోత్సహించడమేనని ఈ ప్రాంత ప్రజలు మండిపడు తున్నారు.
మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పునర్నిర్మాణం కోసం అసెంబ్లీలో నిధులు కేటాయించాలని ప్రస్తావించారు. కానీ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం గురించి రేడియాలజిస్ట్ భర్తీ అంశం గురించి కూడా చర్చ చేయాల్సి ఉందని ఈ ప్రాంత వాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైద్య మాఫియాను ప్రోత్సహించడం కోసమేనా!?
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితోపాటు గర్భం దాల్చిన మహిళలకు సిటీ, అల్ట్రా సౌండ్ వంటి స్కానింగ్ చేయాల్సి ఉంది. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఆ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. గర్భం దాల్చిన మహిళలకు మాత్రం సంబంధిత గైనకాలజిస్టులు వారంలో ఒకరోజు మాత్రమే స్కా నింగ్ చేస్తున్నారు. . ఫలితంగా రోగులంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.
ఒక్కో స్కానింగ్, ఎక్స్రేరే పేరుతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ప్రస్తుతం వాటి మనుగడ కొనసాగాలంటే జిల్లా జనరల్ ఆసు పత్రిలో రేడియాలజిస్టు పోస్టు భర్తీ కావొద్దు అన్న ఉద్దేశమే అందరిలో నెలకొందని విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే పాలకులు కూడా రేడియాలజిస్ట్ భర్తీ కోసం ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి చెంచుపెంటలు అధికంగా ఉన్న అచ్చంపేట, కొల్లాపూర్ వంటి నల్లమల అటవీ ప్రాంతాలతో పాటు నాగర్ కర్నూల్ ప్రజలు జిల్లా జనరల్ ఆసుపత్రికి అధికంగా వస్తుంటారు.
ఇందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని చిన్నపాటి కట్టు కట్టి హైదరాబాద్ మహబూబ్నగర్ వంటి పట్టణాలకు రెఫర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ ప్రాంత పాలకులు గట్టి ప్రయత్నం చేసి రేడియాలజిస్ట్ భర్తీ చేసేందుకు శ్రద్ధ వహించాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.