calender_icon.png 27 July, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థియేటర్లలో చూడటం తలకు మించిన భారమే

27-07-2025 12:46:00 AM

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై మురళీమోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మురళీమోహన్ మాట్లాడుతూ.. “రైటర్‌గా త్రివిక్రమ్ మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నాం.

కానీ, స్రవంతి కిషోర్‌కు మాటిచ్చాను.. వారి బ్యానర్‌లో సినిమా చేస్తానని త్రివిక్రమ్ అన్నారు. ఆ తర్వాత మా వద్దకు వచ్చి మూడు గంటలపాటు ‘అతడు’ కథను కళ్లకు కట్టినట్టు చెప్పారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసింది. అలా మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకువచ్చింది. నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు. నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు.

‘నాకు వేషం ఇవ్వండి అని ఎవ్వరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు. అందుకే ఇంతవరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. అయితే, ఇందులో నాజర్ పోషించిన పాత్రకు శోభన్‌బాబును అనుకున్నాం. కానీ, ఆయన మా ఆఫర్‌ను తిరస్కరిం చారు. హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ఇప్పుడు రకరకాల మాధ్యమాలు వచ్చాయి.

అందుకే థియేటర్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. ఓ మధ్యతరగతి కుటుంబం థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలంటే తలకు మించిన భారంగా మారింది. పార్కింగ్, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్, టికెట్లు .. ఇలా అన్నింటి ధరలు ఎక్కువగా పెరి గాయి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్, జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల, ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని పాల్గొన్నారు.