22-05-2025 12:38:33 AM
-ఎండీ అశోక్ రెడ్డికి టీజేఈయూ గౌరవాధ్యక్షుడు మధు యాష్కీ గౌడ్ వినతి
ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి) : రిజర్వేషన్ నిబంధనలు, పదోన్నతులు, గ్రాట్యూటీ చెల్లింపుపై అధికారులతో తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈయూ) గౌరవ అధ్యక్షులు మధు యాష్కి గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన సమస్యలపై చర్చించారు.
ప్రధానంగా రిజర్వేషన్ నిబంధనలు(రూల్ ఆఫ రిజర్వేషన్స్) అమలు విషయంలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, టీజేఈయూ తరఫున అధికా రులకు లేఖ రూపంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్న నేపథ్యంలో టీజేఈయూ వారిని అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఇంతేకాకుండా, ప్రస్తుతం పదోన్నతులు నిలిపివేయడంవల్ల సీనియర్ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్న నేపథ్యంలో, సీనియారిటీ ఆధారంగా తక్షణమే పదోన్నతులు కల్పించాలనే వినతిని కూడా ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా 01.09.2004 తరువాత నియమితులైన ఎన్.పి.ఎస్(న్యూ పెన్షన్ స్కీం) పరిధిలో ఉన్న బోర్డు ఉద్యోగులకు పదవీ విరమణ గ్రాట్యూటీ, మరణ గ్రాట్యూటీ ఇంకా అమలులోకి రాకపోవడంపై టీజేఈయూ గతంలో ఎన్నోసార్లు వినతులు సమర్పించినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు.
ఈ అంశాన్ని కూడా అధ్యక్షులు ఎండీ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాటర్ సప్లై స్వీరేజ్ విభాగంలో కీలకమైన సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మధు యాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎండీ జాంగిర్, బి.దేవేందర్, సైద్ అక్తర్ అలీ, ఎం.రాంచేందర్, బి.మహేష్, గౌస్ పాషా, నరసింహారెడ్డి, సాయి చరణ్, శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.