calender_icon.png 22 May, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టులెక్కువ.. పోటీ తక్కువ

22-05-2025 12:39:39 AM

  1. డీఎడ్ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ
  2. అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు
  3. బీఎడ్ అభ్యర్థులూ ఆసక్తి
  4. 25న డీఈఈ సెట్ 
  5. హాజరుకానున్న 43,616 మంది అభ్యర్థులు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): డీఎడ్ కోర్సుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు తక్కువగా ఉండటం, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టు లు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు అటువైపుగా ఆసక్తి చూపుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70% ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయ డం, 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడంతో ప్రతీ డీఎస్సీలోనూ ఎస్జీటీ ఖాళీలు ఎక్కువ గా ఉంటున్నాయి.

తాజాగా 2024లో ప్రభుత్వం 11వేలకు పైచిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేయగా, అందులో 7 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులే ఉండ టం గమనార్హం. ఈ నేపథ్యంలో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది.  డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 25న జరగనుంది.

ఈ అర్హత పరీక్షకు ఈ ఏడాది ఏకంగా 43,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 2024లో 17,656 దరఖాస్తులు రా గా, 2023లో మరీ తక్కువగా 6,486 దరఖాస్తులే వచ్చా యి. కానీ 2024లో అత్యధిక మంది చిన్న వయసులో టీచర్ ఉద్యోగాలు సాధించడంతో ఈసారి అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో అర్జీలు వచ్చాయి. ఒకప్పుడు డీఈడీ కోర్సుకు ఫుల్ డిమాండ్ ఉండేది.

2012 సమయంలోనే మేనేజ్‌మెంట్ సీటు ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పలికేది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమ రీ తరగతులకు బోధించాలంటే డీఎడ్ చేసి ఉండాల్సిందే. ఆపై తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు బీఎడ్ అర్హత ఉండాలి. కానీ, 2018లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌తోపాటు, బీఎడ్ అభ్యర్థులూ అర్హులేన ని జాతీయ ఉపాధ్యాయ మండలి ఆదేశాలు జారీ చేసింది.

దీనికి తోడు డీఎస్సీ నోటిఫికేషన్లు రాకపోవడంతో డీఈడ్‌కు డిమాండ్ తగ్గింది. అయితే ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులే అర్హులంటూ 2023లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, గతేడాది నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉండటం, ఒక్కో పోస్టుకు పోటీ పడుతున్న వారి సంఖ్య సైతం తక్కువగా ఉండటంతో ఈసారి ఈ కోర్సుకు మళ్లీ డిమాండ్ పెరిగింది.

పోటీ తక్కువగా ఉండటంతో..

కాంగ్రెస్ ప్రభుత్వం 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో వేసిన డీఎస్సీలో దాదాపు ఏడు వేల వరకు ఎస్జీటీ పోస్టులుంటే వాటికి పోటీ పడింది 60 వేల మంది అభ్యర్థులే. మొన్నటి డీఎస్సీలో దాదాపు 30 జిల్లాల్లో వందకు పైగా ఎస్జీటీ ఖాళీలున్నాయి. అదే ఎస్‌ఏ పోస్టులు మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. క్యాటగిరీ వారీగా వచ్చేసరికి ఎస్జీటీ పోస్టులకు ఒక్క పోస్టుకు నలుగురు, ఐదుగురు మా త్రమే పోటీ ఉండేది.

కానీ, ఎస్‌ఏ పోస్టులకు మాత్రం అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో క్యాటగిరీల్లో ఎస్‌ఏ పోస్టులే లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలోనే త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో డీఈఈసెట్ ఎంట్రెన్స్ రాసి డీఎడ్ చేసిఉంటే ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించవచ్చన్న ఆలోచనలో అభ్యర్థులున్నారు. అంతేకాకుండా బీఎడ్ చేసిన ఉన్నవారు కూడా ఈసారి డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.

బీఎడ్ చేసి ఎస్‌ఏ పోస్టు కొట్టడం కంటే, డీఎడ్ చేసి ఎస్జీటీ కొలువు సాధించడం సులువని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఈసారి భారీగా దరఖాస్తు లు చేశారు. డీఎడ్‌కు గత కొంతకాలంగా డిమాండ్ పడిపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు మూత బడ్డాయి.

ఒకప్పుడు 220 డీఎడ్ కాలేజీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 80కి తగ్గింది. గతంలో దాదాపు 11,500 వర కు సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 4 వేలకు పడిపోయింది. డీఎడ్‌కు మళ్లీ పూర్వవైభవం రావటంతో కాలే జీల యాజమాన్యాలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.