21 August, 2026 | 2:04 AM

దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్

21-08-2026 01:17 AM

గురుకుల పాఠశాలలో పరిశుభ్రత, మెనూ అమలులో నిర్లక్ష్యంపై ఆగ్రహం  

ప్రిన్సిపాల్, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు

దమ్మపేట, ఆగష్టు 20, (విజయక్రాంతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దమ్మపేట గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ వార్డెన్లకు గురువారం కలెక్టర్ అంకిత్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. మండలంలో అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇందులో భాగంగా పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామం, మందలపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మండల పరిధిలోని పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ రోగుల వివరాలు, వైద్యులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.   

రక్త పరీక్షల విభాగాన్ని పరిశీలించిన సందర్భంగా అనాలసిస్ యంత్రం పనిచేయకపోవడాన్ని గమనించారు. అది ఎప్పటి నుంచి పనిచేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించగా, సుమారు ఏడాది కాలంగా పనిచేయడం లేదని తెలిపారు. యంత్రం నిర్వహణ, మరమ్మతుల కోసం ఇప్పటికే దరఖాస్తు సమర్పించామని సిబ్బంది వివరించారు. దీనిపై జిల్లా వైద్యాధికారిని ఫోన్లో సంప్రదించిన కలెక్టర్.. మీ ఇంట్లో ఏదైనా పరికరం పనిచేయకపోతే ఇలాగే వదిలేస్తారా? అని ప్రశ్నించారు.

సుమారు రూ.3 లక్షల విలువైన వైద్య పరికరం ఏడాది కాలంగా పనిచేయకపోయినా దాని మరమ్మతులు, నిర్వహణకు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరామతులు చేయించు వినియోగాలకు తీసుకురావాలని ఆదేశించారు.  మదలపల్లి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, డిజిటల్ క్లాస్రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు.డిజిటల్ క్లాస్రూమ్లో చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన పాఠశాలలో తరగతి గదులను సైతం పరిశుభ్రంగా ఉంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూలో పేర్కొన్న కూర అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ వార్డెన్ను ప్రశ్నించారు.

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఎందుకు అందించడం లేదని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. డైనింగ్ హాల్లో డస్ట్బిన్ ఉన్నప్పటికీ దానిని సక్రమంగా నిర్వహించకపోవడంతో హాల్లో అపరిశుభ్రత నెలకొనడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, మెనూ అమలులో నిర్లక్ష్యం వహించినందుకు ప్రిన్సిపాల్, వార్డెన్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ వెంట శిక్షణ డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తహసీల్దార్ మురళి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.