4 August, 2026 | 4:19 PM

రామప్ప నుండి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలి

04-08-2026 03:12 PM

గణపసముద్రం సరస్సును నింపి   సాగునీరు విడుదల చేయాలి

​రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు

జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలి

బిఆర్ఎస్ మండల నాయకుల డిమాండ్

​గణపురం,(విజయక్రాంతి): ములుగు జిల్లా రామప్ప సరస్సు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రం సరస్సును నింపి మండల కేంద్రంలోని గణపసముద్రం ఆయకట్టుకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధికారుల సూచనలతో అప్పులు చేసి నారు మడులు పోసుకున్న రైతులకు, నాట్ల సమయానికి నీటి సరఫరా నిలిపివేయడం దారుణమన్నారు. చెరువులో 17 అడుగుల నీరున్నా అధికారుల నిర్లక్ష్యంతో విడుదల చేయడంలేదని మండిపడ్డారు. ​

గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలో రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రామప్పలో తగినంత నీరున్నా స్థానిక ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ​గణపురంలో 90 శాతానికి పైగా కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడ్డాయని, జిల్లా కలెక్టర్ స్పందించి రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపసముద్రానికి, అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సరస్సు ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.