పీఎం శ్రీ నిధుల వినియోగంపై అధికారుల పరిశీలన
బోథ్,(విజయక్రాంతి): పాఠశాలలో వసతులు కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం నుండి జిల్లాలో 27 ప్రభుత్వ పాఠశాలకు ఏడాదికి పది లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసింది. అయితే మంజూరైన నిధులలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంతమంది పక్కదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం పీఎం శ్రీ నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
రెండు సంవత్సరాల నుండి నిధుల మంజూరు....
గత రెండు సంవత్సరాల నుండి పీఎం శ్రీ నిధులను 27 పాఠశాలలకు ఏడాదికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ నిధుల నుండి విద్యార్థులకు వసతుల కల్పనతో పాటు పర్యాటక ప్రాంతాలను సైతం చూపించాల్సి ఉంది. అయితే కొన్ని పాఠశాలల్లో నిధుల వినియోగం పక్కదారి పట్టినట్లు అధికారులకు తెలియడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కమిటీని నియమించి రికార్డును తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది.
బినామీల అకౌంట్లోకి నిధులు...
పీఎం శ్రీ నిధులను కొంతమంది ప్రధానోపాధ్యాయులు వారి బినామీల అకౌంట్లోకి నిధులు మళ్లించినట్లు సమాచారం. ఏ వస్తువు కొనుగోలు చేసిన సంబంధిత షాపు యజమానికి నిధులను ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు చేసిన వస్తువులు తక్కువ మోతాదులో ఉంటే నిధులు మాత్రం ఎక్కువగా డ్రా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో వాస్తవాలు తెలియాలంటే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో విచారణ చేస్తే వివరాలు బయల్పడే ఆస్కారం ఉంది.
ఉపాధ్యాయుల మధ్య నివేదాలతో
పి ఎం శ్రీ నిధులు మంజూరి అయిన కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడి నిధుల వినియోగంపై ఆరోపణలు చేసుకోవడంతో అక్రమాలు బయటపడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. బజార్హత్నూర్ మండల కేంద్రంలోని మోడల్స్ స్కూల్లో నిధుల అక్రమాలపై విచారణ జరిపించేందుకు జిల్లా కలెక్టర్ కమిటీ వేసి ఇటీవల విచారణ జరిపించినట్లు తెలిసింది. పాఠశాలకు మంజూరు అయిన పీఎం శ్రీ నిధుల దుర్వినియోగం బట్టబయలు కావాలంటే అధికారులు తగు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.






