calender_icon.png 23 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీరంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం

23-06-2025 01:01:12 AM

  1. మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఇక ఏటా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు

విజన్ స్టూడియోస్ అధినేత రమేశ్ వెల్లడి 

వివిధ రంగాల వారికి ఘనంగా అవార్డుల ప్రదానం 

సినిమా ప్రతినిధి, జూన్ 22 (విజయక్రాంతి): వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారికి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ’ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవారడ్స్ 2025’ పేరుతో ఈ అవారడ్స్ అందించారు. ఈ సంస్థ వారు మొదటిసారి నిర్వహించిన ఈ అవారడ్స్ ప్రదానోత్సవానికి హైదరాబాదులోని ఓ హోటల్ వేదికైంది.

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సినీరంగంతోపాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘రమేశ్ కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన విజన్ స్టూడియోస్ స్థాపించి 11 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు.

హైదరాబాదును బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాదులో సినీరంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రిగా నేను ఆ బాధ్యత వహిస్తాను‘ అన్నారు. 

విజన్ స్టూడియోస్ అధినేత రమేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న బిజినెస్ నుంచి స్టూడియో స్థాపించే దాకా ఒక లక్ష్యంతో పట్టుదలగా పనిచేశాం. ఇప్పుడు మా విజన్ స్టూడియోస్ నుంచి పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు ఉపాధి పొందుతున్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవారడ్స్ అందిస్తున్నాం. సినీరంగంతోపాటు విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో ఈ అవారడ్స్ ప్రతి సంవత్సరం అందిస్తాం‘ అన్నారు. 

ఈ కార్యక్రమంలో టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాతలు రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, గురురాజ్ నటీనటులు దివ్యవాణి, రచ్చ రవి, గుండు సుదర్శన్, మిస్ ఏషియా అనుష తదితరలు పాల్గొన్నారు.