calender_icon.png 10 July, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైన పటారం.. లోన లొటారం!

10-07-2025 12:47:31 AM

  1. మానుకోట రైల్వే స్టేషన్ దుస్థితి ‘సాగు’తున్న అభివృద్ధి పనులు 
  2. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

మహబూబాబాద్, జూలై 9 (విజయ క్రాంతి): రైల్వే స్టేషన్ ముందు వైపు చూడగానే అబ్బో ఎంతో అద్భుతంగా ఉందని అనుకోవడం.. లోనికి వెళ్ళగానే కనీసం కూర్చోవడానికి కూడా సౌకర్యాలు లేక , అసంపూర్తి పనులతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో చేర్చి 39 కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం చేపట్టిన అభివృద్ధి పనులు ‘సాగు’తున్నాయి.

దీనితో రైలు ప్రయాణికులు ఈ స్టేషన్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో డైలీ, వీక్లీ కలుపుకొని మొత్తం 39 రైళ్లు ఆగుతాయి. ప్రతిరోజు  వందలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ఇతర రాష్ట్రాలతో పాటు ఖమ్మం, వరంగల్, విజయవాడ, సికింద్రాబాద్ కు నిత్యం రాకపోకలు సాగిస్తారు. ఏడాదికి 15 నుండి 20 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

దీనితో కాజీపేట - విజయవాడ రైల్వే సెక్షన్లో ఉన్న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను రైల్వే శాఖ ఆదర్శ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు. నూతన రైల్వే స్టేషన్, ఫ్లాట్ ఫారాల విస్తరణ, ఫుల్ కవర్ షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, టాయిలెట్ బ్లాకులు, ప్రయాణికుల విశ్రాంతి గదులు,  స్టేషన్ సుందరీకరణ, వాహనాల పార్కింగ్, టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు తదితర వసతుల కల్పన పనులు చేపట్టారు. అయితే కొత్త పనుల నిర్వహణ కోసం, గతంలో ఉన్న సౌకర్యాలను పూర్తిగా తొలగించారు.

1,2 ప్లాట్ ఫారాలపై గతంలో ఉన్న తక్కువ నిడివిగల ఫుల్ కవర్ షెడ్లను తొలగించారు. అలాగే ప్లాట్ ఫారాలను విస్తరించే పనులు చేపట్టారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయకుండా నెలల తరబడి సాగదీస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల 2 వ నెంబర్ ప్లాట్ ఫారం పై ప్రయాణికులకు కనీస వసతులు లేకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. 

గతంలో ఉన్న ఫుల్ కవర్ షెడ్డు తొలగించడం వల్ల ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తుందని చెబుతున్నారు. 2 వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై కోచ్ డిస్ప్లే బోర్డులు పనిచేయడం లేదని, దీనితో రిజర్వేషన్ కలిగిన ప్రయాణికులకు తాము ఎక్కాల్సిన  రైలు కోచ్ ఎక్కడ నిలుస్తుందో తెలియక అయోమయం పాలవుతున్నారు. అలాగే ఒకటవ నంబర్ ప్లాట్ఫారంపై పూర్తిగా ఫుల్ కవర్ షెడ్లు నిర్మించినప్పటికీ, ప్లాట్ ఫారం పనులు పూర్తి చేయకపోవడంతో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

కొత్తగా నిర్మిస్తున్న ఓవర్ వంతెన నిర్మాణం పిల్లర్లకే పరిమితం చేశారని, 1 వ నంబర్ ప్లాట్ఫారం లో ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్ నుండి టికెట్ తీసుకొని ప్రస్తుతం ఉన్న పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి వరకు ముందుకు నడిచి అక్కడ నుండి  2 వ నెంబర్ ప్లాట్ఫారం వైపు దిగి మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి వస్తుందని, లగేజీ ఉన్నవారు, చిన్న పిల్లలు,  వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.

1 వ ప్లాట్ఫారంపై లిఫ్ట్ పనిచేస్తుండగా, 2 వ ప్లాట్ ఫామ్ పై ఉన్న లిఫ్టు ను మూసివేశారు. దీనితో వృద్ధులు మెట్లు ఎక్కి దిగేందుకు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్ ముందు భాగాన్ని సుందరంగా తీర్చిదిద్ది, స్టేషన్లో మాత్రం ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో  జాప్యంపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.