calender_icon.png 10 July, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్నీ బ్యాగుల గడబిడ!

10-07-2025 12:57:04 AM

-రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విండో కార్యదర్శి మధ్య కిరికిరి 

-ఆగ మేఘాల మీద కార్యదర్శిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు

-బయటకు పొక్కుతుందని బదిలీ చేశారా..?

-విజిలెన్స్ విచారణ జరిపితే అసలు విషయం బట్టబయలు అయ్యే అవకాశం 

-సొసైటీ కార్యదర్శి ఆకస్మిక బదిలీపై మతలబు ఏమిటి?

-మిల్ అసోసియేషన్ అధ్యక్షుని కనుసన్నల్లో సొసైటీ సెక్రటరీ బదిలీ !

-సొసైటీ లావాదేవీలపై  అధికారులు చర్యలు శూన్యం

కామారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కోసం విండో కార్యాలయాలకు వచ్చిన గన్ని బ్యాగుల లో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. అసలే రాని. గన్ని బ్యాగులకు విండో కార్యదర్శి రైస్ మిల్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు, రైస్ మిల్   యజమాని రిసిప్ట్ అడగడంతో గన్ని బ్యాగుల స్వాహా చేశారని ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అసలు ప్రభుత్వం నుంచి వచ్చిన గన్ని బ్యాగులు లారీ లోడ్ ఎక్కడికి వెళ్లిందని విషయం విజిలెన్స్ విచారణ జరిగితేనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి. 

కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో జరుగుతున్న అవకతవకలపై సొసైటీ కార్యదర్శి బాల్ రెడ్డి ని వివరణ కోరగా రైస్ మిల్ యజమాని  సొసైటీకి ఇవ్వవలసిన గన్ని బ్యాగులు  సొసైటీకి ఇవ్వకపోవడంపై రైస్ మిల్  యజమాని దురుసుగా ప్రవర్తించడంతో వారిరువురి మధ్య చిన్న తగాదా ఏర్పడ్డ దని దాన్ని పరిష్కరించే క్రమంలో ఒకరి పై ఒకరము దురుసుగా మాట్లాడ్డంతో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమాచారం ఇచ్చామని తెలిపారు.

రైస్ మిల్ యజమాని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షు డీగా చలామణి అవుతున్న నాయకుడు ఉన్నత అధికారుల తో మాట్లాడి విండో కార్యదర్శి బదిలీ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వివరాల్లోకి వేళ్తే రైస్ మిల్ యజమాని గత కొన్ని రోజులు గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రావలసిన గన్ని బ్యాగులు సుమారు 8000 వరకు రావలసి ఉండగా వాటిని ఇవ్వకపోవడంమే కాకుండా సొసైటీకి అప్పగించినట్లు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమని తనపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు.

రైస్ మిల్ ఓనర్ వ్యవహారం సరిగా లేకపోవడంతో  సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన వడ్లు తన రైస్ మిల్క్ పంపాలని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూనే  ఉన్నాడనీ. రైస్ మిల్ కు వడ్ల లోడ్ పంపితే తరుగు పేరుతో అన్ని రైస్ మిల్ల కన్నా ఎక్కువ తరుగు తీస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ క్రమంలో వడ్ల లారీ అన్లోడింగ్ చేయడానికి ఎక్కువ సమయం వెయిటింగ్ లో పెట్టేవాడని ,మిగతా రైస్ మిల్ కు పంపి ఈ రైస్ మిల్ కు తక్కువ వడ్లు పంపడంతో తనపై కక్ష సాధింపుగా గన్ని బ్యాగులు పంపడాన్ని నిలిపివేసి పంపినట్లుగా ప్రచారం చేసుకుంటూ నాతో నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలని ఒత్తిడి తేగా నేను అందుకు ససేమీరా ఒప్పుకోకపోవడంతో నాపై మాటలతో దాడి చేశాడు.

ఈ దాడి కాస్త ఇరువురి మధ్య విభేదాలను పెంచిందని ఇదే క్రమంలో అధికార పార్టీ నాయకులతో తనపై లేనిపోనివి చెప్పి బదిలీ చేయించాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. రైస్ మిల్  యజమాని వ్యవహారము ప్రవర్తనా తీరుపై సొసైటీ బాల్ రెడ్డి పెదవి వివరిస్తూ తనకు ఇబ్బంది కలగజేశాడని ఆయన తెలిపాడు. రైస్ మిల్ యజమాని రైతులకు సంబంధించిన వడ్లు కొనుగోలు చేయడంపై లారీలో నుంచి అన్లోడ్ చేసుకోవడంపై సక్రమంగా ఉండేవాడు కాదని తరుగు తరచుగా ఎక్కువ తీసేవాడని ఈ క్రమంలో రైస్ మిల్ యజమానులతో మాట్లాడి ఎవరు తొందరగా సరుకు దింపుకుంటే వారికే పంపించానని తెలిపారు.

తక్కువ తరుగు తీసుకున్న వారికి ఎక్కువ లోడ్లు పంపించానని ఆయన తెలిపారు. దోమకొండ లో ఉన్న తన రైస్ మిల్ కు ఎక్కువ లోడ్లు వడ్లు పంపించాలని తనపై రైస్ మిల్ యజమాని ఒత్తిడి తెచ్చిన వినకపోవడంతో వివాదం చేస్తున్నారని విండో కార్యదర్శి బాల్ రెడ్డి విజయ క్రాంతి తో తెలిపారు. ఉన్నతాధికారులతో ఒత్తిడి తేవడంతో తను రైతుల పక్షాన త్వరగా అన్లోడ్ చేసుకున్న రైస్ మిల్ కు ఎక్కువ పంపిస్తామని తెలుపగా నేను అధికార పార్టీ నాయకుడని , డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడనీ తెలిసి నా గ్రామంలో నాకే పంపవా అని అక్కస్తో తనపై ఫిర్యాదు చేశాడని ఆరోపించారు.

విండో చైర్మన్ నాగరాజురెడ్డి వివరణ... 

గన్ని బ్యాగులపై ఏర్పడ్డ సందిగ్ధతను వివరిస్తూ రైస్ మిల్ యజమాని గన్ని బ్యాగులు ఒక లోడు పంపించానని చెప్పగా సొసైటీ కార్యదర్శి పంపించలేదని చెబుతున్నారు. వారి ఇరువుల మధ్య వివాదం రాజుకోవడంతో ఈ బదిలీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి  వెళ్లిందన్నారు.  జిల్లా అధికారు లు తనను  ఆకస్మిక బదిలీ చేసి పంపించారు. సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్ గా, మా ప్రమేయం లేకుండానే రైస్ మిల్ ఓనర్ తమ పార్టీ నాయకులకు చెప్పడంతో ఈ చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ చర్య వల్ల సొసైటీకి అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. బడా నాయకులు రైతులను దృష్టిలో ఉంచుకొని రైస్ మిల్ యజమాని మాటలు పట్టించుకోకుండా రైతుల క్షేమం కోరి పని చేసే అధికారులను ఇక్కడ ఉంచాలని కోరారు. ఇదిలా ఉండగా రైతులు ఈ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు. రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో విండో కార్యదర్శి వడ్ల లోడ్లను తక్కువ తరుగు తీసే రైస్ మిల్లులకు పంపగా రైస్ మిల్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షునిగా చలామణి అవుతున్న యజమాని ఉన్నతాధికారుల తో ఒత్తిడి తెచ్చి కార్యదర్శిని బదిలీ చేయడం తగదన్నారు. తమకు ప్రయోజనము కలిగే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రయోజనాలను దెబ్బతీయకుండా పనిచేసే అధికారులే మాకు కావాలని రైతులు కోరుతున్నారు.

రైస్‌మిల్ యజమాని ఆగడాలకు సొసైటీ కార్యదర్శి బలి కావాల్సిందేనా? 

సొసైటీలో నష్టం వస్తే రైతులకు నష్టం కలుగుతుంది. కనుక అలాంటి నష్టపరిచే రైస్ మిల్ యజమానులను, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు లాభం చేకూర్చే పనులు జరిగే విధంగా ఉన్నత అధికారులు అధికార పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఇలా జరుగుతుంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో జరిగిన లావాదేవీలపై అనుమానాలు రేకెత్తుతున్నాయని వాటిపై దర్యాప్తు చేసి ఆడిట్ చేసి నిజానిజాలు నెగ్గు తేల్చాలని రైతులు భావిస్తున్నారు.

ఒక రైస్ మిల్ యజమాని మాట్లాడితేనే సెక్రటరీ ఆకస్మిక బదిలీ చేస్తే వాటి అంతరార్థం ఏమై ఉంటుంది. సొసైటీ మొత్తాన్ని రైస్ మిల్ యజమానులే పాలకవర్గం ప్రతినిధులను తమ గుప్పెట్లో పెట్టుకొని , రైస్ మిల్ యజమాని సొసైటీని పాలిస్తున్నట్లా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ సహకార సంఘం ఆర్థిక లావాదేవీల పై, సహకార సంఘం పరిధిలో కొన్న వరి కొనుగోళ్ల లావాదేవీలపై, కొనుగోలు చేయగా వచ్చిన కమిషన్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ లీడర్ ఏ రూపంలో దండుకున్నాడో తెలియక ఆర్థిక పరిస్థితులు అవగాహన లేని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో ప్రభుత్వ అధికారులు ఇంటలిజెన్స్ అధికారులు సొసైటీ ఆర్థిక లావాదేవీలపై నిఘవేయడం రైతులకు క్షేమకరమని రైతులు కోరుతున్నారు. 

ఇలాంటి సంఘటనలు మరెన్నో..

కామారెడ్డి జిల్లాలో పలు విండో కార్యాలయాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరించిన చోట గన్ని బ్యాగులు, తరుగు తీయుటలో  అవకతవకలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని విండో కార్యాలయం నుంచి రైస్ మిల్ కు వరి ధాన్యంలోడ్ వెళ్లగా తరుగును ఎక్కువగా తీసి రైతులకు నష్టం చేసిన విషయాన్ని విజయక్రాంతి గతంలో వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే.

ఇలాంటి ఘటనలు జిల్లాలో పలు రైస్ మిల్ యజమానులు విండో పాలకవర్గం నేతలతో కుమ్మక్కై రైతులకు చెందిన వడ్లలో తరువు పేరుతో పెద్ద మొత్తంలో తరుగు తీసుకొని వాటి డబ్బులను సొసైటీ పాలకవర్గం, సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్ యజమానులు పంచుకున్న దాఖలాలు కూడా జిల్లాలో ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో దోపిడీ చేసి డబ్బులు పంచుకున్న అధికార పార్టీ నాయకులు, విండో పాలకవర్గ సభ్యులు, రైస్ మిల్ యజమానుల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ రైతుల ప్రయోజనాన్ని గుర్తించి తరుగు పేరుతో దోపిడీ చేసిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని రైతును కోరుతున్నారు. విజిలెన్స్ తో విచారణ జరిపించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు.