విశ్వబ్రాహ్మణ ఉపతరగతులు ఒక్కటిగానే పరిగణిస్తాం
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణ కులానికి సంబం ధించి అన్ని ఉపతరగతులను చివరిలో ఒకటిగానే పరిణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సర్వేను సబ్ క్యాటగిరీల వారీగానే నిర్వహించినప్పటికీ చివరిలో కంప్యూటరీకరణ ద్వారా ఒకటిగానే తీసుకుని నివేదిక సమర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు సాంకేతిక సహకారం అందిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు ఉత్తర్వులిస్తామని పేర్కొంది.
విశ్వబ్రాహ్మణ కులంలోని ఉప తరగతులన్నింటినీ ఒక్కటిగా పరిగణించకుండా వేర్వే రుగా సర్వే నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ విశ్వబాహ్మిణ్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రధాన కార్యదర్శి పీ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విశ్వబ్రాహ్మిణ్/ విశ్వకర్మలోని ఉపతరగతులను ప్రత్యేకంగా పరిగణిస్తూ స్వతంత్ర కోడ్ కేటాయిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది రాతపూర్వక వివరణ దాఖ లు చేస్తూ విశ్వబ్రాహ్మణ కులంలో అవుసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పులు.. ఇలా 5 ఉపవర్గాలున్నాయని తెలిపారు.
సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సబ్ క్యాటగిరీల వారీగా సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఆయా వృత్తి వర్గాలకు తగిన పథకాలను తేవడానికి అవకాశం ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక విశ్వబ్రాహ్మణ ఉప తరగతులను కలిపి నివేదిక రూపొందిస్తామని తెలిపారు. ఈ హామీని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణను మూసివేశారు.






