19 April, 2026 | 2:08 AM

కేంద్రం కుట్రను భగ్నం చేశాం: రాహుల్ గాంధీ

19-04-2026 12:27 AM

మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరచాలని కేంద్రం చూస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు ప్రజల ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్‌లో తగ్గించేందుకే బీజేపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళ కోటా బిల్లు వెనుక రహస్య అజెండా ఉందని, ఆ బిల్లు పేరుతో డీలిమిటేషన్‌కు మార్గం సుగమం చేసుకోవాలనే కుట్ర ఉందని ఆరోపించారు. ఇండియా కూటమి, విపక్షాల ఐక్యతతో ఆ బిల్లును పార్లమెంటులో వీగిపోయేలా చేశామని వివరించారు. దేశం అంటే అనేక రాష్ట్రాల సమాహారమని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రాష్ట్రానికి సమాన గౌరవం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే నాయకుడు అంటూ ప్రధాని మోదీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.