calender_icon.png 17 December, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం

17-12-2025 12:00:00 AM

  1. ప్రజలు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేసుకోవచ్చు

జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడవ విడత ఎన్నికలు నిర్వహించనున్న  5 మండలాల్లో  ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణములో సజావుగా  నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు  చేయడం జరిగిందని, ప్రజలు తమ అమూల్యమైన ఓటును తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. 

మంగళవారం  పెబ్బేరు, చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్  మండల కేంద్రాల్లో  ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్  డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు.  మూడవ విడతలో  పెబ్బేరు  మండలంలో 17 సర్పంచి, 141 వార్డు మెంబర్లు, చిన్నంబావి మండలంలో 16 సర్పంచి, 139 వార్డు మెంబర్లు, వీపనగండ్ల మండలంలో 14 సర్పంచి.

124 వార్డు మెంబర్లు, శ్రీరంగాపూర్ మండలంలో 8 సర్పంచి, 77 వార్డు మెంబర్లు , పానగల్ మండలంలో 26 సర్పంచి, 221 వార్డు మెంబర్లు వెరసి 81 గ్రామ సర్పంచి, 702 వార్డు మెంబర్లకు బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు.  ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగే పోలింగ్ లో  ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని సూచించారు.

ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ భద్రత కల్పించడం జరిగిందని, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర నిఘా పెడుతూ ఎక్కడైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా లేదా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన లేదా భయబ్రాంతులకు గురి చేసిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల అథారిటీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు పెబ్బేర్ మండలంలో, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ వీపనగండ్ల మండలంలో,  ఆర్డీఓ సుబ్రమణ్యం చిన్నంబావి మండలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పర్యవేక్షించారు.  తహసీల్దార్లు,  ఎంపీఓలు  తదితరులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.