17-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట డిసెంబర్ 16 : మండల కేంద్రంలోని దమగ్నపూర్ ఎమ్మెల్యే స్వగృహం నందు మంగళవారం రోజున ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగృహం నందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పని చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఓటు వేసి గెలిపించిన ప్రజల ఆశలు నెరవేర్చేలా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఓటమి చెందిన అభ్యర్థులు కూడా ప్రజల సమస్యలపై పట్టు వదలకుండా సేవ చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 80% శాతం సర్పంచ్ లను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ఎన్నికల ఫలితాలే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని, రాష్ట్రంలో మరోసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న భూత్పూర్, మూసాపేట్, అడ్డాకుల మండలం లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచులను గెలుచుకుంటుందని తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారు.