పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి
జాగీర్దార్లు, జమీందార్ల దోపిడీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు
మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
ముషీరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో చైతన్యమై ఓటుతో రాజకీయ అధికారాన్ని సాధించాలని మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నిర్వహించిన ‘పాపన్న ఆలోచన విధానం భావజాల వ్యాప్తి’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాపన్నను స్మరించడం అంటే కేవలం నివాళులర్పించడం కాదని, ఆయన నిర్మించిన ప్రజా ఐక్యతను పునర్నిర్మించి ప్రజాస్వామ్య మార్గంలో రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం సాధించడమే నిజమైన నివాళి అని అన్నారు. మొగల్ పాలనకు అనుకూలంగా ఉన్న జాగీర్దార్లు, జమీందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తు చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ బహుజనుల్లో ఐక్యత, పాలనపై చైతన్యం నింపిన మహానేత పాపన్న అని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఈ.తిరుమలి మాట్లాడుతూ పాపన్న ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, బహుజనుల ఆశాజ్యోతి అని కొనియాడారు. గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, యెలికట్టే విజయకుమార్ గౌడ్, దుర్గయ్య గౌడ్, బైరు శేఖర్, కోలా జనార్ధన్, పల్లె రవికుమార్ గౌడ్, బబ్బూరి భిక్షపతి, ప్రొఫెసర్ వెంకటేష్, విష్ణువర్దన్ గౌడ్, పొన్నం నారాయణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.






