calender_icon.png 23 October, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బురద రాజకీయాలు మానుకోవాలి!

23-10-2025 01:03:12 AM

  1. బస్తీ దవాఖానల్లో రోజుకు 45వేల మందికి వైద్యం
  2. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ ఆసుపత్రులపై కొందరు నేతలు బురద జల్లుతున్నారని, ప్రజలే వారికి మరోసారి గుణపాఠం చెపుతారని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బస్తీ దవాఖానతో ప్రతి రోజూ సుమారు 45 వేల మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

అన్ని రకాల మందులు బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయని, డయాగ్నస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే రోగులకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల లోపు టెస్ట్ రిపోర్టులు పేషెంట్లకు అందజేస్తున్నామన్నారు. బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై పేషెంట్ల రద్దీ తగ్గిందన్నారు.

పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ హాస్పిటళ్లపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమన్నారు.

కేవలం ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలతో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని పేర్కొన్నారు.