22 August, 2026 | 4:02 AM

వరంగల్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి

22-08-2026 12:00 AM

మొయినాబాద్, ఆగస్టు 21(విజయ క్రాంతి): సెప్టెంబర్ 9న వరంగల్లో నిర్వహించనున్న ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ మండల కమిటీల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. మొయినాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల ముఖ్య నాయకుల సమావేశం మాజీ మండల అధ్యక్షుడు కొండిగారి మహేందర్ మాదిగ అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై బలమైన పోరాటాలు నిర్మించాలని అన్నారు. కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్ కమిటీలను బలోపేతం చేయాలని, రాజకీయాలకు అతీతంగా చదువుకున్న యువతను కమిటీల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

సెప్టెంబర్ 5లోపు గ్రామ, మండల కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసి వరంగల్ మహాసభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, మాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకర్రావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.