22 August, 2026 | 2:35 AM

తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడాలి

22-08-2026 12:00 AM

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు

ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, వెంటనే ప్రత్యేక పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. శుక్రవారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల భద్రతను మెరుగుపరచాలని కోరారు. విద్యార్థులకు కౌన్సెలింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాల భవనాలపై ప్రత్యేక భద్రతా ఆడిట్ చేపట్టాలని సూచించారు.

మూసివేతకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలలను రక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక సర్వే నిర్వహించి, అనంతరం విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని హేమా సుదర్శన్ జిల్లోజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం చేపట్టి, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కిసాన్ వింగ్ అధ్యక్షుడు నీరేటి ఆంజనేయులు, ఉప్పల్ వార్ ఇన్చార్జి సి. మల్లికార్జున్, రాష్ట్ర నాయకుడు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.