25 August, 2026 | 1:42 AM

నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి

25-08-2026 12:35 AM
  1. ప్రత్యేక వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలి
  2. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): నాటిన ప్రతి మొక్కనూ భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించే జీవనదాతగా భావించి, పసిపాపను పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకున్నంత అపురూపంగా వాటిని సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశిం చారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ చివరి నాటికి ఎలాగైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసేలా పకడ్బం దీ కార్యాచరణను చేపట్టాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25న నిర్వహించనున్న ‘ప్రత్యేక వనమహోత్సవం’ కార్యక్రమాన్ని విజయవం తంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అటవీ అధికారులతో సోమవారం మంత్రి కొండా సురేఖ సన్నాహక సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి కొండా సురేఖ జూమ్ వేదిక ద్వారా సమావేశంలో పాల్గొని,  జిల్లాల వారీగా చేపట్టి న ఏర్పాట్లు, పురోగతిపై సమీక్షించారు.

2026 వనమహోత్సవ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం గా పెట్టుకోగా, 23 ఆగస్టు 2026 నాటికి 9.06 కోట్ల మొక్కలను నాటినట్లు అటవీ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, రైతులు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు తదితర అన్ని వర్గాల సహకారంతో ప్రత్యేక వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని సూచించారు.

మీడియా ప్రతినిధులను కూడా వనమహోత్సవంలో భాగస్వాములను చేసి, మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీని సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా మొక్కలను సరఫరా చేయాలని, జలాశయాల కట్టలపై అనువైన మొక్కలను నాటి సంరక్షించాలన్నారు.

రైతులకు, గౌడ సామాజిక వర్గానికి వారి వారి అవసరాల మేరకు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. దేవాలయాలు, దేవాలయ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. జిల్లా కలెక్టర్లు, డీఎఫ్‌ఓలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు.