calender_icon.png 14 May, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వీడాలి

03-05-2025 12:00:00 AM

లోడింగ్, అన్లోడింగ్ విషయంలో నిబంధనలు పాటించాలి

నాగర్ కర్నూల్ మే 2 (విజయక్రాంతి ):వరి కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అలకత్వం పీడాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం తాసిల్దార్ తబిత రాణితో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడింగ్ అన్లోడింగ్ విషయంలోనూ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మిల్లర్లు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని, ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్ లను తనిఖీ చేసి, ఓపీఎంఎస్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా? రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ప్రతిరోజూ పరిశీలిస్తున్నారా?

సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారా? కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పల గురించి పలు వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, పౌరసరఫరాల శాఖ అధికారులు రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు.

తాలు లేకుండా సరిచూసుకోవాలని, తేదీ, రైతు పేరు, ఫోన్ నంబర్, ధాన్యం కొనుగోళ్ళ పూర్తి వివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని, తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తిచేసి, అదే రోజు సంబంధిత మిల్లులకు తరలించాలని, కేంద్రాల్లో ఎక్కువ రోజుల వరకు నిల్వ చేయకూడదని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.అంతకుముందు రైస్ మిల్లును సందర్శించి ధాన్యం లోడింగ్ అన్ లోడింగ్ స్టాక్ రిజిస్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు.