calender_icon.png 19 July, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకటి తాకని జ్ఞాన కిరణాలం కావాలి!

10-04-2025 12:00:00 AM

స్వార్థంలో మునిగి, అవినీతితో తడిసి, అహంతో జీవిస్తున్న జనవాహిని నైతిక ప్రవర్తన వైపు తమ దృష్టిని కేంద్రీకరించాలి. అహర్నిశలూ శ్రమిస్తూ కరెన్సీ కట్టలమధ్య గడుపుతూ, నిజమైన జీవితాన్ని వృథాగా గడిపేస్తున్న వారు కొందరైతే, భోగాల్లో జీవిస్తూ, రోగాలతో బాధ పడుతూ నిత్యం చస్తూ బతు కుతున్న వారు మరికొందరు. చాలామంది వ్యసనాలు, వంచనలతో జీవిత పరమార్థాన్ని మరచి, బతుకు విలువును దిగజా ర్చుకుంటున్నారు.

భిన్నమైన మనస్తత్వాలు, వైరుధ్యాలతో నేటి సమాజం గందరగోళంగా మారింది. ఇలాంటి పరిస్థితులను మార్చడానికి ఎంతోమంది తత్త్వవే త్తలు తమదైన మార్గాలలో మానవాళికి అనేక బోధనలు చేశారు. కొందరు ప్రజల్లోని మూఢనమ్మకాలపై ఉద్యమించి శాస్త్రీ య దృక్పథాన్ని పెంపొందిస్తే, ఇంకొందరు నైతిక ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని ప్ర బోధించారు. మానవాళిని సరైనా పంథా లో నడిపించిన వారు ఎందరో చరిత్రో మిగిలిపోయారు. అలాంటి మహానుభావులను అవలోకనం చేసుకోవాలి.

వారిలో మన దేశంలో జన్మించిన మ హోన్నత వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒక రు. ఆయన రచనలు, ప్రవచనాలు నేటికీ యువతకు మార్గదర్శకాలుగా పని చేస్తున్నాయి. ‘యువతపైనే దేశ భవిష్యత్తు ఆధా రపడి ఉన్నదని’ ఆయన స్పష్టం చేశారు.

జీవితంలో ఎవరికి వారే ఆత్మశోధన చేసుకోవాలన్నారు. మన అంతరాత్మకు మించిన అద్భుతమైన శక్తి మరొకటి లేదనీ వెల్లడించారు. కష్టాలను భరించే శక్తి అత్యంత గొప్పదని వివేకానందుల భావన. ఆయన దృష్టిలో చావుకు భయ పడటం ఒక మూర్ఖత్వం. 

‘జ్ఞానులం’ అనుకోవడం ఒక రుగ్మత

జర్మనీకి చెందిన తత్త్వవేత్త ఫ్రెడరిక్ నీట్షే ఒక విమర్శకుడు. వ్యంగ్యం, తత్త్వం, సత్యం, కవిత్వం, విలువలపై ఆయన కృషి సలిపారు. స్వీయ అనుభవాల ద్వారా మాన వుడు తనను తాను నిర్మించుకోవాలని, ఊహాజనిత శక్తులకు ప్రభావితం కాకూడదని సూచించారు. నీతికి స్థానం కల్పించి, సత్యాన్ని బతికించడం కోసం గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ తన జీవితాన్నే త్యాగం చేశారు. 

ఆయన ఒక మహాజ్ఞాని అయినా తన ను తాను అజ్ఞానిగానే ప్రకటించుకున్నారు. నిజానికి తాము జ్ఞానులమని విర్రవీగిన వాళ్లు చరిత్రలో అసలైన అజ్ఙానులుగానే మిగిలిపోయారు. ఎంతటి వారైనా నిరంతర జ్ఞానం కోసం పరితపించాలి. జ్ఞాను లమని భావించడం ఒక మానసిక రుగ్మత. సోక్రటీస్ మహాజ్ఞాని అయినప్పటికీ ఏనాడూ తన విచక్షణను కోల్పోలేదు. వివేకవంతమైన ఆలోచనలతో నిత్యం ప్రజలను చైతన్య పరిచారు.

జీవితమంటే కేవలం జన్మించి, మరణించటం కాదన్నారు. ప్రతి ఒక్కరికీ సంభవించే ‘మరణం గురించి ఆలోచించడం వృథా’ అనీ పేర్కొన్నారు. సత్యం, ధర్మం, నీతి నిజాయతీలను ఎట్టి పరిస్థితుల్లో  తప్పకూడదని చెప్పారు.

అయితే, సమాజాన్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో నాటి గ్రీకు పాలకులు సోక్రటీస్‌కు విషమిచ్చి చంపడం దారుణం. పాలకుల చర్యలను ఆనాటి గ్రీకు ప్రజలు సమర్థించలేదు. సోక్రటీస్ పట్ల అత్యంత గౌరవం ప్రదర్శించారు. ప్రపంచానికి ఒక వెలుగుదారి చూపడం ద్వారా శాస్త్రీయ దృక్పథానికి అందించిన నిజమైన మేధా సంపన్నుడు సోక్రటీస్. 

ఇలా ఎంతోమంది మహానుభావులు మన ముందు సజీవంగా లేకపోయినా వారి జీవితాలు భావి తరాలకు స్ఫూర్తినిస్తాయి. జీవితం అనేక పరీక్షలు పెడుతుం ది. బాధలు, కష్టాల గురించి తెలియని వాళ్లు సుఖమంతమైన జీవితానికి అలవాటుపడి బాహ్య ప్రపంచంతో సంబంధం లే కుండా అజ్ఞానులుగా మిగిలిపోతారు. ప్ర స్తుతం ఇదే జరుగుతున్నది. ఇతరులు ఏ మైపోయినా సరే, తాము మాత్రం సుఖం గా బతకాలనే స్వార్థ ధోరణి అనేకుల్లో పెరుగుతున్నది. నీతి నియమాలను గాలికి వదిలేసి, ఎవరి సుఖాన్ని వాళ్లు చూసుకుంటే మానవ పుట్టుకకు అర్థం ఉండదు. 

కన్ఫ్యూషియస్ చైనీయుల గురువుగా ప్రసిద్ధి. నీతి ఆధారంగా సమాజం సద్గతిలో పయనించాలని ఆశించారు. సమాజంలో నీతి కరువైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ప్రస్తుత ప్రపంచ పోకడలు నిరూపిస్తున్నాయి.

చంచల ఆలోచనలు విడనాడాలి

తెలుగువాడిగా జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన మహాజ్ఙాని, తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆయన గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కృత్రిమంగా కాకుండా హృ దయం నుంచి స్పందన రావాలన్నారు. అప్పుడే మార్పు సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారు. పూలపాన్పులా సాగే జీవితాన్ని త్యజించి, నిరాడంబర జీవనాన్ని ఆయన ఎంచుకున్నారు.

తత్త్వంలో ఆధునికత్వాన్ని జోడించిన నిజమైన దార్శనికుడు జిడ్డు కృష్ణమూర్తి. నేటి ప్రపంచ గమనాన్ని సరిచేయడానికి ఆయన బోధనలు చక్కగా ఉపకరిస్తాయి. ‘అనవసరంగా ఎవరినీ నమ్మవద్దని, చంచలమైన ఆలోచనలు విడనాడి ఉన్నతంగా ఎదగాలని’ సూచించారు. ‘అయితే, ఉన్నతంగా ఎదగడమంటే కోట్లు సంపాదించడం కాదు. ఉన్నత ఆలోచనలతో, ఉత్తమంగా జీవించడం. సాధారణ జీవితాన్ని గడపటంలోనే నిజమైన సంతృప్తి దాగి ఉంది’. తన రచనలు, ప్రసంగాల ద్వారా ప్రజల్లో మానసిక పరిణితి తీసుకురావడానికి జిడ్డు కృష్ణమూర్తి ఎంతో కృషి చేశారు.

ఆయన నాస్తి కుడు, ఆస్తికుడిగా కాకుండా ఒక వాస్తవిక వాదిగా ఉన్నారు. ‘మూర్ఖత్వం గర్వానికి పరాకాష్ట. ఆత్మాభిమానం మానవ జన్మకు ఆభరణం. ఎవరి చెంతనో మన స్వాభిమానాన్ని తాకట్టు పెట్టి జీవించడంలో అర్థం లేదు. నిష్కల్మష హృదయంతో జీవించా లి. ఇతరుల దుర్బోధలకు దూరంగా ఉం డాలి’. కులాన్ని, మతాన్నిబట్టి ఎవరూ అధికులు కాలేరని, జ్ఞానాధికులమనే అపరి పక్వ భావన కేవలం మనసులో పరాకాష్టకు చేరిన మూర్ఖత్వమేనని అన్నారు జిడ్డు కృష్ణమూర్తి. శతక పద్యాల ద్వారా విలువైన విషయాలను బోధించిన వారిలో యోగి వేమన ఒకరు.

బోగభాగ్యాలను త్యజించి, జీవిత సత్యాలను ఆకళింపు చేసుకున్నారు. ప్రజలు నిజాన్ని గ్రహించి జీవించాలనే ఉద్దేశంతో మనసుకు గుచ్చుకునేలా అనేక విషయాలను ఆయన నిక్కచ్చిగా చెప్పారు. నీతిమంతమైన సమాజ స్థాపనకు ప్రజల్లో చైతన్యం రగిలించిన వేమన పద్యాలను మనం మరవకూడదు. ‘పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది’ అనే గొప్ప నీతివాక్యాన్ని కాళోజీ బోధించారు.

ఆయన మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని అందరం గ్రహించాలి. మనల్ని మానసికంగా బలహీన పరిచే అలవాట్లకు దూరం కావాలి. ధైర్య సాహసాలతో కేవలం దేశం కోసమే జీవించి, దేశం కోసమే మరణించిన మహనీయుల జీవితాలు భావి తరాలకు ఆదర్శం. అయితే, చరిత్ర చదవని అజ్ఞానుల చేతుల్లో అది సృష్టించిన మహనీయుల జీవిత గాధలు సమాధి అవ్వడం బాధాకరం.

వ్యాసకర్త సెల్: 9704903463