10-04-2025 12:00:00 AM
నేడు మహావీర్ జయంతి
క్రీస్తుపూర్వం 599లో పాట్నా సమీపంలోని కుండల గ్రామంలో (నాటి వైశాలి, నేటి బీహార్ రాష్ట్రం) చైత్రమాసంలో రాణి త్రిశూల, రాజు సిద్ధార్థ దంపతులకు వర్ధమాన్ లేదా మహావీర్ జన్మించాడు. భగవాన్ మహావీర్ చివరి తీర్థంకరుడు (ఋషి లేదా రక్షకుడు)గా ఆయన నిలిచారు. యుక్త వయస్సుకు రాగానే రాజ్య పగ్గాలు చేతపట్టి మూడు దశాబ్దాల పాటు పరిపాలన చేశాడు. తర్వాత విలాసవంతమైన జీవన విధానానికి స్వస్తి పలికి సత్యాన్ని వెతుకుతూ, ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. పన్నెండేండ్లపాటు సన్యాసిగా ప్రవాసంలో గడిపారు. జ్ఞానోదయం పొంది జైనమత స్థాపనకు బీజావాహనం అయ్యారు. ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ధర్మమార్గాన్ని ప్రబోధించారు. 24వ, చివరి తీర్థంకరుడిగా పేరు తెచ్చుకున్నారు. నేడు 2,623వ భగవాన్ మహావీర్ జయంతిని జైన సమాజం పెద్ద ఎత్తున, భక్తిపూర్వకంగా జరుపుకుంటున్నది.
అన్ని జీవులపట్ల శాంతిని కలిగి ఉంటూ, అహింస, కరుణతో జీవించాలనే, ఇదే అత్యున్నత మానవ ధర్మమని మహావీరుడు ప్రబోధించారు. సూక్ష్మజీవుల నుంచి అతిపెద్ద జంతువుల వరకు అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించడం అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ మౌలిక సూత్రాలే చివరకు జైనమత ఆవిర్భావానికి పునాదులు అయ్యాయి. అనేక ఏండ్లపాటు కఠిన తపస్సు, ధ్యానం చేసిన పిదప అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందారు. ఈ శుభదినాన అనేకమంది ప్రజలు జైన ఆలయాల సందర్శన, ప్రార్థనలు, సంకీర్తనలు, భజనలు, మహావీర్ ఉత్సవ విగ్రహంతో రథయాత్ర, ఊరేగింపులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, దానధర్మాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఇంద్రియాలను నియంత్రించడంలో అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ‘మహావీరుడు’ అనే పేరును సార్థకం పరిచారు. జైనమత స్థాపన తర్వాత 72వ ఏట క్రీ.పూ. 527లో మోక్షం పొందారు. మహావీర్ జయంతి సందర్భంగా జైనులు దైవికా గమ్యస్థలం మధుబన్, గుజరాత్‌లోని గిర్నార్, జైనుల ఆరాధనా స్థలం ముంగితుంగి, మహారాష్ట్ర గజపంథ, గోమఠేశ్వర ప్రదేశాలను పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు.
- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి