calender_icon.png 2 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక హక్కులకై ఉద్యమాలకు సిద్ధం కావాలి

02-11-2025 05:45:38 PM

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి సలీమ్..

నకిరేకల్ (విజయక్రాంతి): తమ హక్కుల సాధన కోసం కార్మికులందరూ సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీమ్ పిలుపునిచ్చారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో సిఐటియు నకిరేకల్ మండల జనరల్ బాడీ సమావేశం పొడిచేటి నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1970లో ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని ఆయన తెలిపారు.

నాటినుండి నేటి వరకు కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడం కోసం వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులనుకాలరాసిందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడుదారులకు అప్పనంగా అప్పజెప్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని అధికారంలోకి రాగానే ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు.

కార్మిక వర్గ సమస్యలపై చర్చించడానికి డిసెంబర్ 29, 30 తేదీలలో నల్లగొండలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ వంటెపాక వెంకటేశ్వర్లు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తడువై రాములు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు పల్స సైదులు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల అధ్యక్షులు వసంత,  మినీ గూడ్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మల్లేష్, సిఐటియు నాయకులు బి శ్రీనివాస్, ఎస్ వీరయ్య, మల్సూర్, సుభాషిని, రాంబాబు, ఎస్కే లతీఫ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.