calender_icon.png 25 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియాలా పనిచేయాలి

25-05-2025 12:43:44 AM

-అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి 

-ఒక రాష్ట్రం ఒక ప్రపంచ 

-గమ్యస్థానం లక్ష్యంతో ముందుకెళ్లాలి 

-అన్ని ప్రాంతాలు  అభివృద్ధి చేస్తే.. వికసిత్ భారత్ కోసం 2047 వరకు వేచి చూడాల్సిన పనిలేదు

-నీతిఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 

న్యూఢిల్లీ, మే 24: దేశంలో పర్యాటకాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ “ఒక రాష్ట్రం ప్రపంచ గమ్యస్థానం” అన్న కొత్త నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు.

ఈ నినాదంతోనే రాష్ట్రాలు ముం దుకు సాగాలని, వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో నీతిఆయోగ్ పాలకమండలి 10వ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాయాది పాకిస్థాన్ మీద ఆపరేషన్ సిందూర్ దాడులు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి నీతి ఆయోగ్ సమావేశం ఇదే కావడం గమనార్హం. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  

ఏ లక్ష్యమూ కష్టం కాదు.. 

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పని చేస్తే ఏ లక్ష్యమూ కష్టం కాదు. అసాధ్యం అనేదే ఉండదు. మనమంతా కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక్క పర్యాటక గమ్యస్థానాన్నైనా అభివృద్ధి చేసుకోవాలి. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి.

ఈ ప్రాంతాలు పొరుగున ఉన్న ప్రాంతాలను కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాయి. వికసిత్ భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినపుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం నినాదంతో ముందుకెళ్లాలి.

భవిష్యత్ నగరాలు నిర్మించేటపుడు వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం అనే వాటిని పాటించాలి. భారతదేశంలో వేగంగా పట్టణీకరణ చెందుతోంది. భవిష్యత్ నగరాలు నిర్మించేలా మనమంతా పని చేయాలి. ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలి. ప్రతి నగరం, నగరపాలిక, గ్రామం అభివృద్ధి వైపు అడుగులేయాలి. మనం ఈ తరహాలో పని చేస్తే వికసిత్ భారత్ కోసం 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. శ్రామిక శక్తిలో మహిళలను కూడా భాగం చేయాలి.’ అని తెలిపారు. 

గైర్హాజరయిన ముగ్గురు దక్షిణాది సీఎంలు

ఈ సమావేశానికి దక్షిణాదికి నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి డుమ్మా కొట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.