26-01-2026 02:35:33 AM
చెన్నై, జనవరి 25: తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎలాంటి తలొగ్గదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని టీవీకే అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదని, ప్రజాస్వామ్య యుద్ధమని అభివర్ణించారు. ఆదివారం మామల్లపురంలో జరిగిన భారీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ వేదికపై పార్టీకి కేటాయించిన ‘విజిల్’ గుర్తును ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తల కేరింతల మధ్య స్వయంగా విజిల్ ఊది ఉత్సాహాన్ని నింపారు.
అనంతరం విజయ్ మాట్లాడుతూ గతంలో తన సినిమాలకు ఉన్న ఆదరణ ఈ గుర్తు ద్వారా ప్రజల్లోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక గుర్తు కాదని ప్రజల గొంతుకని ఆయన చెప్పారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. 2026 ఎన్నికలు కేవలం ఓట్ల పండుగ మాత్రమే కాదని ప్రజాస్వామ్య యుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని విజయ్ పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై విజయ్ విమర్శల వర్షం కురిపించారు.
ఈ రెండు పార్టీలు బీజేపీకి లొంగిపోయాయని ఆరోపించారు.అధికార పక్షం పరోక్షంగా, ప్రతిపక్షం ప్రత్యక్షంగా కేంద్రానికి సహకరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వారు విఫలమయ్యారని విమర్శించారు. కేవలం సాధ్యమయ్యే పనులనే తాము చెబుతామని విజయ్ వెల్లడించారు. జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. నటుడు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరపున ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ వేదికపై పార్టీకి కేటాయించిన ’విజిల్’ గుర్తును విజయ్ ఆవిష్కరించారు. డిజిటల్ గుర్తింపు కార్డుల ద్వారా కార్యకర్తలను అనుమతించడం పార్టీ పద్ధతిని చాటిచెప్పింది.ఎన్నికల ప్రణాళికలో భాగంగా జనవరి 26 నుండి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభమవుతుంది.
చెన్నైలో మొదలయ్యే ఈ యాత్ర మొత్తం 234 నియోజకవర్గాల్లో సాగుతుంది. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. పార్టీ నాయకత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పొత్తుల విషయంలో విజయ్ వ్యూహాత్మక మౌనం పాటించారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.టీవీకే ఒంటరిగా పోటీ చేసినా విజయం సాధిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తమ వద్ద బలమైన సైన్యం ఉందని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అవినీతి లేని పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కొత్త రాజకీయ శకానికి పునాది వేస్తామని ప్రకటించారు. మామల్లపురం వేదికగా విజయ్ చేసిన ఈ యుద్ధ ప్రకటన తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించింది. రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ముమ్మరం కానుంది.