గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు
ఎమ్మెల్సీ దండే విఠల్
పెంచికలపేట, జూలై 28 (విజయ క్రాంతి): పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో పోడు భూముల సాగు విషయంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మంగళవారం రైతులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ అధికారులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తరతరాలుగా పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతుల హక్కులను హరించే చర్యలకు పాల్పడవద్దని అధికారులను హెచ్చరించారు.
పోడు భూముల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతులను బెదిరించడం లేదా సాగును అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను కాపాడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు.
పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాడతాం. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ జోక్యంతో అధికారులు సానుకూలంగా స్పందించి, గిరిజన రైతులు తమ పోడు భూముల్లో సాగు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.






