వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం
- పార్టీకోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత
- మెదక్ కాంగ్రెస్ ఖిలా
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
మెదక్, ఆగస్టు 24(విజయ క్రాంతి) : వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో అధికారంలోకి వస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌ డ్ అధ్యక్షతన నిర్వహించిన మెదక్ పీఏసీ సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు పూజల హరికృష్ణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుంటామని, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. పార్టీని నమ్ముకున్న పాత నేతలకు 70 శాతానికి పైగా పదవులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెదక్ కాంగ్రెస్ పార్టీకి ఖిల్లాగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడి ఓటు హక్కును కాపాడేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేశాయని తెలిపారు.
2002 నిబంధన పేరుతో అర్హులైన వారి ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.న్యాయంగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తున్నామని, తెలంగాణలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
పేదలకు చేరువలో వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. రఘునందన్‌రావును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. జెన్జీ ఉద్యమం ప్రధాని మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను కొందరు పనిగా పెట్టుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్న కేటీఆర్ రాజకీయంగా అదే గాలిలో కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అయితే హద్దులు దాటి మాట్లాడితే పార్టీ ఉపేక్షించదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్పు విమర్శలు చేస్తూ, దళితుడిని అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన చరిత్ర ఆ పార్టీదేనని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ 100 సీట్లతో అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పా లన పట్ల సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.






