యువత మేలుకో.. డ్రగ్స్‌కు బానిస కావద్దు..
భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్
భద్రాచలం, ఆగస్టు 24, (విజయక్రాంతి ): భద్రాచలం జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ భద్రాచల పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ అరుణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి ప్రభావం మరియు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్కు విద్యార్థులు, యువత ఎట్టి పరిస్థితుల్లోనూ బానిస కావద్దని సూచించారు. డ్రగ్స్ మొదట సరదాగా లేదా స్నేహితుల ఒత్తిడితో ప్రారంభమైనప్పటికీ, క్రమంగా తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
4వ వార్డు మెంబర్, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఇంచార్జ్ బండారు శరత్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో చదువు అత్యంత ముఖ్యమైనదని, తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదవాలన్నారు. తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






