22-08-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): భారీ వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 25 వేలు చెల్లించాలని, పంట నష్ట పరిహారం చెల్లించేంతవరకు రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం పెన్‌గంగా వరద ముంపు గ్రామాల్లోఆయన విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా జైనథ్ లోని ఆనంద్ పూర్, కాప్రి, కరంజి, సాంగిడి, భేదో డా తరితర గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. కాగా సాంగిడి గ్రామానికి చెందిన లచ్చన్న అనే రైతు తన మూడు ఎకరాల సోయా పంట పూర్తిగా నీట మునిగిందని మాజీ మంత్రితో కన్నీరు పెట్టుకున్నారు. పంట పూర్తిగా నష్టపోయి నాలుగు రోజులు అవుతున్న ఇంతవరకు ఎంపీ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, అధికారులు సైతం ఎవ్వరూ వచ్చి తమ గోడులు ఆలకించలేదని ఆవేదన వెళ్లగక్కారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రి జూప ల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో రైతుల గోడు వినకుండానే తన పర్యటనను ముగించుకోవడం సరికాదన్నారు. వర్షాలు కురిసి, పంట నష్టం జరిగి ఐదు రోజులు గడుస్తున్న ఇంతవరకు అధికారులు సర్వేకు చేపట్టకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్, గోవర్ధన్, లింగారెడ్డి, ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు.