22-08-2025 01:58:43 AM
మధురై, ఆగస్టు 21: వచ్చే సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీకి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తు ప్రసక్తే ఉండదని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ పేర్కొ న్నారు. సింహం ఎప్పటికీ సింహమే అని ఉద్వేగంగా చాటుకున్నారు. కులం, మతం ముఖ్యం కాదని తమిళులకే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. గురువారం సాయం త్రం టీవీకే ఆధ్వర్యంలో మధురైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి అశేష జనవాహిని తరలివచ్చారు. టీవీకే పార్టీ ప్రకటన అనంతరం నిర్వహించిన రెండో అతి పెద్ద సభ ఇదే. సభకు హాజరైన అశేష జనవాహిని ఉద్ధేశించి టీవీకే అధ్యక్షుడు ప్రసం గించారు. సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారని విజయ్ ఆరోపించారు.
డీఎంకే రాజకీయ శత్రువు
డీఎంకే పార్టీ రాజకీయ శత్రువు అని విజ య్ తెలిపారు. ‘బీజేపీ భావజాల శత్రువు. డీఎంకే రాజకీయ శత్రువు. 2026 ఎన్నికల్లో ఈ పార్టీలతో పొత్తు ఉండదు. టీవీకే కేవలం పార్టీ మాత్రమే కాదు. అక్రమ వ్యాపారాలు చేస్తున్న ఎవర్నైనా భయపెట్టే సత్తా టీవీకే సొంతం. మొత్తం తమిళనాడు మా వెనకాల ఉంది. బానిసత్వ కూటమి ఎందులోనూ చేరాల్సిన అవసరం నాకు లేదు. మా కూటమి స్వార్థపూరిత కూటమి కాదు. ఆత్మగౌరవం ఉన్న కూటమి’ అని వివరించారు.
మోదీపై నేరుగా విమర్శలు
మధురై సభలో విజయ్ నేరుగా ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘బీజేపీ తమిళనాడుపై వివక్ష చూపుతోంది. మనకు ముఖ్యమైన దేన్నీ బీజేపీ చేయడం లేదు. 2029 వరకు మీ ప్రయాణం సాఫీగా సాగుతుందని మీరు అనుకుంటున్నారు. నీటి చుక్కలు తామరాకులపై అంటుకోవు. తమిళులు బీజేపీకి ఆకర్షితులు అవరు. మా తమిళ జాలర్లు అరెస్టు అనేక విధాలుగా హింసించబడ్డారు. దయచేసి కచ్చతీవులను మా జాలర్లకు ఇవ్వండి. మాకు నీట్ అవసరం లేదు. మాకు ముఖ్యమైన దాన్ని మీరు చేయట్లేదు’ అని బీజేపీపై విరుచుకుపడ్డారు.
తొలిసారి ఏఐఏడీఎంకేపై దాడి
టీవీకే అధినేత విజయ్ మొదటి సారి ఏఐఏడీఎంకేపై కూడా విమర్శలు చేశారు. ‘ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ఏఐఏడీఎంకేకు సరైన నాయకత్వం లేదు. ఎం జీఆర్ ప్రారంభించిన ఆ పార్టీని ప్రస్తుతం రక్షించే వారు ఎవరు? ప్రస్తుతం పార్టీ ఎలా ఉంది?’ అని విమర్శించారు. బీజేపీ పొత్తుపై కూడా విజయ్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘ఒక దాడి జరిగినపుడు వారు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారు. అనంతరం సమస్యలు సమసిపోతాయి’ మీరు గమనించారా అని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు.
2026లో విజయం మనదే
రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజ యం సాధిస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ‘1967, 1977 ఎన్నికల్లో జరిగిన విధంగా 2026లో కూ డా అఖండ మెజార్టీతో విజయం సా ధిస్తాం. మరోసారి చరిత్రను తిరగరా స్తాం. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానా ల్లో టీవీకే అభ్యర్థులు బరిలో ఉం టారు. 2026 ఎన్నికల్లో టీవీకే కే పార్టీల మధ్యే పోటీ ఉంటుంది’ అని ప్రకటించారు.
స్టాలిన్ అంకుల్ అంటూ ఎద్దేవా..
అధికార డీఎంకే పార్టీపై కూడా విజయ్ మాటల దాడి చేశారు. సీఎం స్టాలిన్‌ను ఆయన టార్గెట్ చేశారు. ‘స్టాలిన్ అంకుల్.. అసలు అంకుల్ ఏంది.. స్టాలిన్ రాష్ట్రంలోని మహిళలకు రూ. 1,000 ఇస్తే సరిపోతుందా? రాష్ట్రంలోని మహిళల రోదనలు మీకు వినిపిస్తున్నాయా? ఇది చాలా తప్పు అంకుల్. మీరు మహిళలను మోసం చేస్తున్నారు’ అని విమర్శించారు. స్టాలిన్ ఢిల్లీ రహస్య సమావేశాలకు హాజరవుతున్నారని ఆరోపించారు.