14-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): నగరంలోని పాత తోట వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని, సంఘటన జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాతతోట ప్రాంతంలో పురాతన భవనం ఒకటి తొలగించే ప్రయత్నం లో జరిగిన ప్రమాదం వలన ఒక్కసారిగా భవనం నేలమట్టం కావడంతో భవనం కింద పనిచేసే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు శిధిలాల కింద చిక్కుకొని మరణిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమాని లక్ష్మణ్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే పాత భవనాన్ని తొలగించే ప్రయత్నం చేశారని చెప్పారు. రాజు అనే గుమాస్తా చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు శిధిలాల కింద ఉండిపోయారని తెలిసిందన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే మున్సిపల్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేశారని, దురదృష్టవశాత్తు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మరణించడం బాధాకరమన్నారు. ఓనర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
మృతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని స్పష్టం చేశారు. టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు.
పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం
హన్వాడ, నవంబర్ 13 : పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ గ్రామంలో నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరాశ్రయ కుటుంబాలకు సురక్షిత గృహాలు లభిస్తున్నాయన్నారు.
ఇల్లు కేవలం గోడలు, పైకప్పు మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి గౌరవం, భద్రత, స్వాభిమానం కూడా అని ఆయన అన్నారు . ప్రతి అర్హుడికి సొంతింటి కల నిజం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వేపూరి కవిత కుటుంబం ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం జరుపుకోవడం పట్ల గ్రామ ప్రజల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, వేముల కృష్ణయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, నవనీత, యాదిరెడ్డి, రామకృష్ణ, సత్తిరెడ్డి, స్వరూప రెడ్డి, అంజిలయ్య, వాసు, మాసయ్య తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపిడిఓ యశోద, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.