07-10-2025 12:50:27 AM
-ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లర్స్ హామీ
-సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి భేటీ
-సమస్యలుంటే పరిష్కరిస్తాం.. కొనుగోళ్లు ఆపోద్దు
-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే టెండర్లలో పాల్గొని పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ టెండర్లలో పాల్గొనాలని చెప్పారు. పత్తి కొనుగోలుకు సంబంధించి ఏర్పడిన ప్రతిష్టంభనపై సోమవారం సచివాలయంలో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు.
సీసీఐ విడుదల చేసిన టెండర్‌లో లింట్ శాతం ఎల్ ఎల్ అలాట్మెంట్ స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సీసీఐ అధికారులు, జన్నింగ్ మిల్లర్లను మంత్రి ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగే చర్యలు ఎవరు చేపట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిన్నింగ్ మిల్లులు పరిశ్రమకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల విషయంలో ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి స్వతంత్ర ఎజెన్సీ ద్వారా పరిశీలించి, వాటిని ధృవీకరినంచుకుని ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
రైతుల హితాన్ని దృష్టిలో పెట్టుకని రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, అందుకు సీసీఐ అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారం రోజుల్లో రైతుల నుంచి పత్తి సేకరిస్తామని మిల్లర్లు తెలిపారు. మ్బుల్‌యాప్, స్టాట్ బుకింగ్, టోల్ ఫ్రీ నంబర్ విషయంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించగా, మండలాలవారీగా రైతు వేదికల ద్వారా ఇప్పటికే యాప్, స్లాట్ బుకింగ్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.