10-12-2025 07:18:04 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని ఆంబజార్, కళాసి బస్తి, పటేల్ చౌక్ ప్రాంతాల్లో సుమారు 50–60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఐరన్ విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఎప్పుడైనా కూలిపోతాయనే భయంతో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం 18వ వార్డ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నరేంద్రుల అనుబాబు ఆధ్వర్యంలో పట్టణ విద్యుత్ శాఖ ఏ.ఈ. సతీష్ కు వినతి పత్రం అందజేశారు.
పాత ఐరన్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో నూతన సిమెంట్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఏ.ఈ. సతీష్ మాట్లాడుతూ పటేల్ చౌక్, ఆం బజార్, కళాసి బస్తి, స్టేట్ బ్యాంక్ మార్గంతో పాటు పలు గల్లీల్లో ఉన్న ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి తొలగింపునకు తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పనుల్లో ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.