10-12-2025 07:22:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 13 శనివారం రోజున జరగనున్న నవోదయ ఎంట్రన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ అన్నారు. బుధవారం నిర్మల్ డిఆర్సిలో జరిగిన చీఫ్ సూపర్డెంట్ల పునఃశ్చరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అనుమానాలను తావివ్వకుండా నిర్వహించాలని సూచించారు. ప్రతి ప్రొఫార్మాను ఖచ్చితమైన సమాచారంతో పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి రూమ్కు 24 మంది విద్యార్థులను కేటాయించాలని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 11:30 నుండి పగలు ఒకటి ముప్పై వరకు జరుగునని ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించే ప్రసక్తి లేదని తెలియజేశారు. ఈ పరీక్ష నిర్వహణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగజ్నగర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ నవోదయ పరీక్షను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నవోదయ పరీక్ష నిర్వహణపై పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ పునఃశ్చరణ తరగతులకు జిల్లాలోని నవోదయ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లు హాజరయ్యారు.