4 April, 2026 | 6:50 AM

14 స్థానాల దాకా గెలుస్తాం

15-05-2024 01:27 AM

కేంద్రంలో ‘ఇండియా’ సర్కారే

ప్రధానిగా రాహుల్‌ను చూడబోతున్నాం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మంథని, మే 14 (విజయక్రాంతి): కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నదని, త్వరలోనే రాహుల్‌గాంధీని భారత ప్రధానిగా ప్రజలు చూడబోతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో 10 నుంచి 14 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటామని తెలిపారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో నిర్మించిన దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పూజలకు ఆయన హాజరయ్యారు.

ఆయనకు వేద పండితులు మహా ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకే పంచుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేశారని ప్రశంసించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం ఖాయమని, అందుకు శ్రీధర్‌బాబు ఎంతో కష్టపడి పని చేశారని కొనియాడారు. 

మంథని ప్రజలకు రుణపడి ఉంటా

మంథని నియోజవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని ప్రజలు తమ కుటుంబంపై గత 40 సంవత్సరాలుగా చూపుతున్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని అన్నారు. మంథని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, కాంగ్రెస్ నేతలు కొండ శంకర్, పెండ్రు రమాదేవి సురేష్‌రెడ్డి, చొప్పరి సదానందం, ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, శశిభూషన్ కాచె పాల్గొన్నారు.