ఎక్కువ సీట్లు మావే
కేంద్రంలో చిన్నపార్టీల సర్కారే
బీజేపీ గెలుపునకు రేవంతే ఎక్కువ కష్టపడ్డారు
గ్రామీణ ప్రాంత ఓటర్లంతా బీఆర్‌ఎస్ వైపే
హమీలు నెరవేర్చని సర్కారుపై జనంలో ఆగ్రహావేశాలు
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మే 14, (విజయక్రాంతి): జూన్ నాలుగో తేదీ తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయేది ప్రాంతీయ పార్టీల కూటమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్డీయేకుగానీ, ఇండియా కూటమికిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకొంటామని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్‌ఎస్, వైసీపీ, బిజు జనతాదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలే క్రియాశీల పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ గులాబీ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టినా వెనక్కు తగ్గకుండా మందుకు సాగామని అన్నారు.
జాతీయ పార్టీల్లో వణుకు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర లోక్‌సభ ఎన్నికలను మలుపు తిప్పిందని కేటీఆర్ అన్నారు. బస్సుయాత్రతో రెండు జాతీయ పార్టీలు దిగిరాక తప్పలేదని, వారికి ముచ్చెమటలు పట్టాయని పేర్కొన్నారు. తెలంగాణ చుట్టూ జాతీయ పార్టీల నేతలు గింగిరాలు కొట్టారని ఎద్దేవా చేశారు. బస్సుయాత్ర ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 420 హమీలిచ్చి తుంగలో తొక్కిన వైనంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రైతుభరోసా, రైతుబంధు, రుణమాఫీ, బోనస్‌పై బోగస్ మాటలను రైతాంగం నమ్మలేదని పేర్కొన్నారు. దేవుళ్లపై ఎన్ని ఒట్లు వేసినా జనాలు సీఎం రేవంత్‌ను నమ్మలేదని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయలేదని..పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరల పెరగుదలతో ప్రజలు వాళ్లను నమ్మలేదని తెలిపారు.
ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీ
ఎన్నికలకు రెండునెలల ముందు బీఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపీ సీటుకూడా రాదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని, కానీ నెల నెలల్లోనే రెండు జాతీయ పార్టీలకు ముచ్చెటలు పట్టించే స్థాయికి వచ్చామని అన్నారు. 17 స్థానాల్లో దీటుగా పోటీ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరించాయని విమర్శించారు. స్థానికంగా బీజేపీ గెలుపుకోసం కాంగ్రెస్ చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు కోసం కిషన్‌రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.
5 నెలలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలన చేసిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పక్కనబెట్టి చిల్లర అంశాలను తీసుకుని ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుని హామీలను నెరవేర్చకపోతే క్షేత్రస్థాయిలో చాలా దారుణమైన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.




