19-01-2026 12:00:00 AM
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష
శేరిలింగంపల్లి, జనవరి 18 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో వాహనా లు నడిపిన 231 మందిపై కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు (1617 జనవరి) సాగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో 187 ద్విచక్ర వాహనాలు, 15 మూడు చక్రాల వాహనాలు, 29 కార్లు ఉండగా, హెవీ వాహనదారులు ఎవరూ పట్టుబడలేదని పోలీసు లు తెలిపారు.
మోతాదే ప్రాణాంతకం బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను పరిశీలిస్తే మద్యం మోతాదు ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో స్పష్టమవుతోంది. 203 మంది 101 నుంచి 200 ఎంజి/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించగా, 16 మంది 201 నుంచి 300 ఎంజి/100 ఎంఎల్ మధ్య, మరో 12 మంది 301 నుంచి 550 ఎంజి/100 ఎంఎల్ వరకు మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ స్థాయి మద్యం మత్తు ప్రాణాలకు మాత్రమే కాదు, రహదారిపై ఉన్న ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగితే 10 ఏళ్ల జైలు మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత2023లోని సెక్షన్ 105 (హత్యకు సమానంకాని మానవహత్య) కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.
గత వారం (12 నుంచి 17 జనవరి)లో డ్రంక్ డ్రైవింగ్ కేసులపై కోర్టులు 45 కేసులను పరిష్కరించగా, ఐదుగురికి జరిమానాతో పాటు సామాజిక సేవ, మరో 40 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ఒక్క క్షణం సరదాగా అనిపించినా, అది జీవితాంతం పశ్చాత్తాపానికి దారి తీస్తుందన్న విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.