అక్రిడేషన్‌తో పాటు సంక్షేమ భరోసా
పాత్రికేయుల కోసం రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పాత్రికేయుల సంక్షేమానికి మరింత భరోసా కల్పించే దిశగా జిల్లాలో నూతన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ తెలిపారు. 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ అక్రిడేషన్ కార్డుల పంపిణీతో పాటు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు చేపట్టడం విశేషమన్నారు.
రెడ్ క్రాస్ సభ్యత్వం ద్వారా అత్యవసర వైద్య సహాయం, ప్రమాదాల సమయంలో ఆర్థిక భరోసా, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని వివరించారు.పాత్రికేయుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాత్రికేయులందరూ తమ అక్రిడేషన్ కార్డులను స్వీకరించడంతో పాటు రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.భవిష్యత్తులో అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందేలా రెడ్ క్రాస్ సభ్యత్వం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్రిడేషన్ ప్రక్రియతో సంక్షేమ కార్యక్రమాలను అనుసంధానం చేయడం ద్వారా పాత్రికేయులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని పాత్రికేయుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు వెల్లడించారు.






