శభాష్ డీసీపీ, గన్‌మెన్!
-వారిని పరామర్శించిన డీజీపీ శివధర్‌రెడ్డి, సీపీ సజ్జనార్
-చాదర్‌ఘాట్ ఘటనలో నిందితుడు.. 22 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్
-పరారీలో ఉన్న వారి కోసం 5 ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 26 (విజయక్రాంతి): శభాష్ డీసీపీ, గన్‌మెన్. మీరు ప్రాణాలకు తెగించి నిందితుని పట్టుకోవడం మీ నిబద్ధతకు నిదర్శనం. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు’ అని చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనలో గాయాలైన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్ చైతన్య కుమార్, ఆయన గన్‌మెన్ మూర్తిని డీజీపీ బి శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు.
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు అధికారులను ఆదివారం వారు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘మొబైల్ స్నాచర్లను పట్టుకునేం దుకు డీసీపీ చైతన్య, గన్‌మెన్ మూర్తి సుమారు 750 మీటర్ల పాటు వెంబడించారు. ఆ క్రమంలో నిందితులు కత్తితో దాడి చేసినా.. వారు వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడారు’ అని కొనియాడారు.
కాల్పుల్లో గాయపడిన ప్రధాన నిందితుడు సయ్యద్ ఒమర్ అన్సారీపై గతంలోనే 22 కేసులు ఉన్నాయని, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై రౌడీ షీట్ ఉందని డీజీపీ వెల్లడించారు. గాయపడిన డీసీపీ, గన్‌మెన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వారు రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిందితుడు అన్సారీకి కూడా శస్త్రచి కిత్స జరిగిందని, అతని పరిస్థితి కూడా నిలకడగానే ఉందని చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందొద్దు: సీపీ సజ్జనార్
నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, పరారీలో ఉన్న ఆటో డ్రైవర్, మరో నిందితుడిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ‘దర్యాప్తులో కొన్ని కీలక క్లూస్ లభించాయి. నిందితుడు ఒమర్ అన్సారీ కదలికలు, అతని పరిచయాలపై ఆరా తీస్తున్నాం. ప్రజ లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నగరంలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాం. రౌడీ షీటర్లు, మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. ఈ ఘటనలో డీసీపీ చైతన్యకు మెడ భాగంలో, గన్‌మెన్ మూర్తికి కాలికి గాయాలయ్యాయని, డ్రైవర్ సందీప్ కూడా అప్రమత్తంగా వ్యవహరించి కీలక పాత్ర పోషించారని సీపీ కొనియాడారు.






