27-10-2025 12:00:00 AM
వెంకటాపూర్ (రామప్ప), అక్టోబర్26, (విజయక్రాంతి): మండలం లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీకమాసం ప్రారంభం కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో రామప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో మార్మోగాయి. ఫ్రాన్స్ దేశస్తులు మరియు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించగా, టూరిజం గైడ్లు ఆలయ విశిష్టతను పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని ప్రకృతి అందాలను తిలకించారు. కార్తీకమాసం ప్రతి ఆదివారం ఇలాగే రద్దీ ఉండే అవకాశం ఉందని, భక్తులకు తగిన సౌకర్యాలను అందించాలని పలువురు కోరారు.