calender_icon.png 2 August, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏం తమాషాలు చేస్తున్నారా?

10-01-2025 12:27:58 AM

  1. ఆక్రమణలకు సహకరిస్తే ఊరుకునేది లేదు
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్

రాజేంద్రనగర్, జనవరి 9: చెరువులు, కుంటల ఆక్రమణకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఏం తమాషాలు చేస్తున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారినగర్ సమీపంలో ఉన్న ధర్మోజికుంట, గొల్లవాని కుంటను రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి రంగనాథ్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మోజికుంట 10 ఎకరాల 12 కుంటలు, అదే విధంగా గొల్లవాని కుంట 22 ఎకరాల 23 కుంటల విస్తీర్ణంలో ఉండగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందడంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు కమిషనర్ వివరించారు.

ధర్మోజికుంట బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నిర్మాణదారులకు సమయం ఇవ్వాలని, అనంతరం అధికారులే కూల్చివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గొల్లవాని కుంటలో ఏర్పాటు చేసిన వెంచర్‌ను పరిశీలించారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ నార్సింగిలోని మూసివాగు పరివాహక ప్రాంతంలో పర్యటించారు. రాజపుష్ప, ఆదిత్య సంస్థల నిర్మాణాలను పరిశీలించారు. ఆయా సంస్థలు గతంలో మూసీలో మట్టి పోయగా దాన్ని తొలగించమని గతంలో పర్యటించినప్పుడు ఆదేశించారు.