02-08-2025 05:46:39 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వృద్ధులతో సంభాషించిన ఆయన, తరువాత తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ సెంటర్ హనుమకొండలో మొట్టమొదట ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు. రెడ్ క్రాస్ రక్తదానం, ఇతర సేవలకు రాష్ట్రంలో తొలి స్థానంలో నిలుస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రెడ్ క్రాస్ సేవలకు మరింత తోడ్పాటు అందించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హనుమకొండ రెడ్ క్రాస్ సందర్శించేవిధంగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా వృద్ధులకు చేనేత కళాకారులు తయారు చేసిన టవెల్స్ తో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పాలకవర్గం షీల్డ్ అందించి సత్కరించింది. తదనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా డాక్టర్ల సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటల సౌకర్యం అందిస్తామన్నారు. వృద్ధులు సమయం విలువైనదిగా గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డా. ఎం. శేషుమాధవ్, బిళ్ల రమణ రెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె. జయంతి, డిఆర్‌డిఓ పీ.డి.యం. శ్రీను, హనుమకొండ డిఎంహెచ్వో ఎ. అప్పయ్య, కేయూ ఈసీ సభ్యులు కె. అనిత రెడ్డి, వృద్ధులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.