02-08-2025 05:49:34 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని అంగన్వాడి టీచర్లు పోలేపాక అంజలి, బింగి జ్యోతి అన్నారు. ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీజ ఆదేశాల మేరకు మండల పరిధిలోని తూర్పుగూడెం 1, 2 అంగన్వాడి కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ బిడ్డకు అందించవలసిన ముర్రుపాలను వాటిలో ఉండే పోషకాలను వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు తప్పనిసరిగా తాగించాలన్నారు.
ముర్రు పాలు బిడ్డకు మొదటి సహజ టీకా అని అన్నారు. అందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టోజ్, విటమిన్లు, ఇమ్యూనో గ్లోబ్యులిన్స్ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు, రోగనిరోధక వ్యవస్ధ బలపడేందుకు తోడ్పడుతాయన్నారు. అలాగే వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయన్నారు. బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు జయమ్మ, స్వర్ణ, ఆశా కార్యకర్తలు శ్రీదేవి నాగమణి,ఆయాలు దాసరి మనమ్మ, ముత్తమ్మ, చిన్నారుల తల్లిదండ్రులు బాలింతలు, గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.