calender_icon.png 2 September, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల ‘నీట్’

12-06-2024 12:00:00 AM

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ2024 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్రాలహైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో  పిటిషన్ కూడా దాఖలయింది. తాజాగా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అమానుల్లాలతో కూడిన వెకేషన్ బెంచ్  పరీక్షను రద్దు చేయడం అంత సులభం కాదని అభిప్రాయపడింది.

ఇదే సమయంలో బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పరీక్షను రద్దు చేస్తే దానికి ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి. అందువల్ల పరీక్షపై వచ్చిన ఆరోపణలకు మాకు సమాధానం కావాలి’ అంటూ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు,  అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై కూడా స్టే విధించడానికి  నిరాకరిస్తూ తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఇంతకీ నీట్ పరీక్షపై వచ్చిన ఆరోపణలు ఏమిటి?  ఎందుకు పరీక్షను రద్దు చేయాలని కోరాల్సి వచ్చింది? ఈ ఏడాది మే మొదటి వారంలో నీట్ పరీక్ష జరిగింది.

తొలుత ఫలితాలను జూన్ 14న ప్రకటిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. కానీ ఈ నెల 4న అంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు  సమయంలో ఫలితాలను వెల్లడించారు. నీట్ ఫలితాల్లో 67 మందికి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ రాగా వారిలో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురికి 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారి తీసింది.దీంతో వివాదం మొదలయింది. ఈ సంవత్సరం పరీక్షల్లో ఒఎంఆర్ షీట్లను ఉద్దేశపూర్వకంగానే చించివేశారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో బాధిత విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది.

దీనివల్ల కూడా చాలా మందికి నష్టం కలిగిందని  ఆరోపణలున్నాయి. అయితే విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదంటూ ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది కానీ అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ పరీక్షలో పేపర్ లీక్ జరిగిందని, ఫలితాల్లోను అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు దండెత్తాయి. పలు చోట్ల అభ్యర్థులు ఆందోళనకు దిగారు కూడా. దీంతో  ఆరోపణలపై విచారణకు యూపీఎస్‌సీ  మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. మరో వైపు కోర్టుల్లో ఈ వ్యవహారంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

వాస్తవానికి  వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ‘నీట్’ను పదేళ్ల క్రితం ప్రవేశపెట్టినప్పటినుంచీ దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది. మొదట ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే ప్రశ్నపత్రం ఉండడంపై దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఆ రాష్ట్రంలో కొందరు అభ్యర్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.  పార్లమెంటులోనూ వాడీ వేడి చర్చ జరిగింది. ఫలితంగా  కేంద్రం దిగివచ్చి ప్రాంతీయ భాషల్లోను  పరీక్ష నిర్వహించడానికి అంగీకరించింది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ పరీక్ష నిర్వహణపై ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది.

పరీక్ష నిర్వహణ మొదలుకొని దానిలో ఇచ్చే ప్రశ్నలు.. ఇలా అనేక అంశాలపై ఆరోపణలున్నాయి. నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఇంత భారీ ఎత్తున జరిగే పరీక్షను ఎంత పకడ్బందీగా నిర్వహించినా ఎక్కడో ఒక చోట తప్పులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.  అంతేకాదు నీట్ పరీక్ష విధానంపైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  వైద్యుడిగా తయారవడానికి ఈ పరీక్ష ఎంతవరకు ఉపకరిస్తుందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికి ఎన్‌టీఏ రాష్ట్రాల సహకారం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆ పని చేయడం లేదు. అందుకే ఇన్ని సమస్యలు.